వాషింగ్ మిష‌న్ రిపేర్ కు వ‌చ్చి రేప్‌

Update: 2018-02-03 04:59 GMT
ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మ‌లేని ప‌రిస్థితి. అప‌రిచితుల్ని న‌మ్మ‌లేం. ప‌రిచ‌య‌స్తుల్ని న‌మ్మ‌లేం. ఆ మాట‌కు వ‌స్తే కుటుంబ స‌భ్యుల‌పై కూడా న‌మ్మ‌కం పోయే దుర్మార్గ రోజులు దాపురించాయి. గ‌డిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే.. ఎప్పుడు ఎవ‌రు ఏ విధంగా మోసం చేస్తారో అర్థంకాని దుస్థితి నెల‌కొంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత సౌల‌భ్యంగా ఉండే ఆన్ లైన్ సేవ‌ల్ని వినియోగించుకోవ‌టం ఎక్కువైంది. ఈ సౌల‌భ్యం వెనుక అపాయం కూడా ఉంద‌న్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఒక ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కావ‌ట‌మే కాదు.. అనుక్ష‌ణం అలెర్ట్ గా ఉండాల‌న్న విష‌యాన్ని చెప్ప‌కనే చెప్పిన‌ట్లుగా ఉంద‌ని చెప్పాలి.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఉండే బాచుప‌ల్లి (జేఎన్టీయూ కుక‌ట్ ప‌ల్లి.. మియాపూర్ ల‌కు ద‌గ్గ‌ర‌)కి స‌మీపంలోని ఒక ప్రాంతం (బాధితురాలి వివ‌రాలు గోప్యంగా ఉంచాల‌న్న స‌దుద్దేశంతో) ఒక మ‌హిళ త‌న వాషింగ్ మెషీన్లో ఏర్ప‌డిన స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ఆన్ లైన్ సేవ‌ల్ని సంప్ర‌దించింది.

నెట్ ఉన్న వివ‌రాల ఆధారంగా ఒక స‌ర్వీసుకు ఫోన్ చేసి.. త‌మ వాషింగ్ మెషీన్ రిపేర్ చేయాల‌ని కోరింది. దీనికి ఓకే అన్న సంస్థ ఒక ప్ర‌తినిధిని పంపారు. అక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఆ త‌ర్వాతే విష‌యం మ‌రోలా మారింది. రిపేర్ చేయ‌టానికి వ‌చ్చిన వ్య‌క్తి వాషింగ్ మెషీన్ రిపేర్ చేస్తున్న‌ట్లు న‌టిస్తూ.. స‌ద‌రు మ‌హిళ మీద మ‌త్తు మందు స్ప్రై చేశాడు. అనంత‌రం ఆమెను న‌గ్నంగా మార్చి ఫోటోలు తీశాడు. ఆపై అత్యాచారం చేశాడు.

త‌న గురించి వివ‌రాలు బ‌య‌ట‌పెడితే ఫోటోలు బ‌య‌ట‌పెడ‌తాన‌న్న బెదిరింపుతో పాటు.. త‌న ద‌గ్గ‌రున్న ఫోటోలతో బెదిరింపుల ప‌ర్వానికి దిగి లైంగిక వేధింపుల‌కుగురి చేయ‌టం మొద‌లు పెట్టాడు. దీంతో.. భ‌రించ‌లేని స‌ద‌రు మ‌హిళ  పోలీసుల్ని ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసి వివ‌రాల్ని గుట్టుగా ఉంచి విచారించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడున్న రోజుల్లో ఆన్ లైన్ సేవ‌లు ఎక్కువ‌య్యాయి. ప్ర‌జ‌లు సైతం ఎక్కువ‌గా వీటి మీద ఆధార‌ప‌డుతున్నారు. ఇదేం త‌ప్పుకాన‌ప్ప‌టికీ.. అలెర్ట్ గా ఉండ‌టం ముఖ్య‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఒంట‌రిగా ఉండే మ‌హిళ‌లు.. ఆన్ లైన్ సేవ‌ల్ని వినియోగించుకోవాల‌నుకునే వేళ‌లో ఇంట్లో వారినో.. ఇంటి ప‌క్క వారినో లేదంటే వాచ్ మెన్ అయినా తోడుగా ఉంచుకోవ‌టం మంచిద‌న్న‌ది మ‌ర్చిపోవ‌ద్దు.
Tags:    

Similar News