నా ఫోన్ నెంబర్‌ కు ఆధార్ లింక్ చేయను: సీఎం

Update: 2017-10-25 12:46 GMT
మొబైల్ నంబ‌రుకు ఆధార్ అనుసంధానం వ్య‌వ‌హారం మ‌లుపులు తిరుగుతోంది. మొబైల్ నంబర్‌ తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అన్ని టెలికాం ఆపరేటర్లు ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. ఆమె ఇవాళ కోల్‌ కతాలో మాట్లాడుతూ తన ఫోన్‌కు ఆధార్‌ను జతపరిచేది లేదని స్పష్టం చేశారు.

`నా ఫోన్ నెంబర్‌కు ఆధార్‌ ను లింక్ చేయను అని, కావాలంటే వాళ్లు నా ఫోన్‌ ను డిస్‌కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదే నిర్ణ‌యానికి నేను క‌ట్టుబ‌డి ఉంటాను`` అని దీదీ అన్నారు. మరోవైపు వచ్చే నెల 8వ తేదీన నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. ఆ రోజున రాష్ట్రం అంతటా నల్ల జెండాలతో నిరసన చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఫోన్ నెంబర్‌ ను ఆధార్‌ కు లింక్ చేయాలన్న అంశంపై వేసిన కేసులను సుప్రీంకోర్టు ఈనెల 30వ తేదీన పరిశీలించనుంది. వివిధ సేవలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి అన్న నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలైన వేర్వేరు అభ్యర్థనలను సుప్రీం విచారించనుంది.

ఇదిలాఉండ‌గా... ఆధార్‌-మొబైల్ లింకేజీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. సర్వీస్ సెంటర్లకు వచ్చి రీ వెరిఫికేషన్ చేయించుకోలేని వాళ్ల కోసం ఇంటి దగ్గరికే టెలికాం సంస్థలు తమ ప్రతినిధులను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఆధార్ ఆధారిత వన్ టైమ్ పాస్‌ వర్డ్ సాయంతోనూ రీ వెరిఫికేషన్‌ ను పూర్తి చేయాలని సూచించింది. అంగవైకల్యం - అనారోగ్యం - వృద్ధాప్యంతో బాధపడుతున్న వారి కోసం ఇంటి దగ్గరికే వెళ్లి రీ వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇలాంటి సేవలు కావాలని అనుకున్నవాళ్లు ఆన్‌ లైన్‌ లోనే రిక్వెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.

ఇక ఆధార్ ఓటీపీ ద్వారా కూడా రీ వెరిఫికేషన్ చేయాలన్నది మరో నిబంధన. ఎస్సెమ్మెస్ - ఐవీఆర్‌ ఎస్ - మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఓటీపీ రీ వెరిఫికేషన్ ప్రక్రియ చేయాలని సూచించింది. దీని ప్రకారం ఆధార్ డేటాబేస్‌ లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌ కు ఓటీపీ పంపించడం వల్ల ఆ నంబర్ రీవెరిఫికేషన్‌ తోపాటు అదే సబ్‌ స్క్రయిబర్ కలిగి ఉన్న ఇతర మొబైల్ నంబర్స్‌ను కూడా రీవెరిఫై చేయొచ్చని ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే 50 కోట్ల మొబైల్ నంబర్స్ ఆధార్ డేటాబేస్‌ లో ఉన్నాయి. సో వీళ్లకు వన్ టైమ్ పాస్‌ వర్డ్ ద్వారా రీ వెరిఫికేషన్ ప్రక్రియ చేయాలన్నది ఆలోచన.

ఇక ఏజెంట్ సాయంతో సిమ్ రీవెరిఫికేషన్ చేస్తున్నట్లయితే.. కస్టమర్‌ కు చెందిన ఈ-కేవైసీ వివరాలను పూర్తిగా ఏజెంట్‌ కు చూపించకుండా జాగ్రత్త పడాలని, వాళ్ల డివైస్‌ లలోనూ ఈ వివరాలను లేకుండా చూడాలని ప్రభుత్వం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఈ-కేవైసీ వివరాలు సదరు టెలికాం సంస్థ ఏజెంట్‌ కు కూడా పూర్తిగా కనిపించేలా ఉంది. సిమ్ రీవెరిఫికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018 మార్చిలోపు ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
Tags:    

Similar News