పారికర్ చెప్పిన కుందేలు, పులి వేట కథ!

Update: 2016-10-03 09:19 GMT
కుందేలును వేటాడడం కోసం అడవిలోకి వెళ్లినప్పుడు సడన్ గా పులి ఎదురైతే... దాన్ని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్. పాక్‌ తో ఎలాంటి ఉద్రిక పరిస్థితులు తెలెత్తినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెబుతున్న సమయంలో తన తల్లి గతంలో తనతో చెప్పిన ఓ మాటను పారికర్ గుర్తు చేసుకున్నారు. కుందేలును వేటాడడం కోసం అడవిలోకి వెళ్లినప్పుడు పులిని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన తల్లి తరచు చెప్పేదని తాజాగా ఒక ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పారికర్ తెలిపారు.

ఈ సమయంలో సర్జికల్ స్ట్రైక్ పై స్పందించిన పారికర్... భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ విజయవంతమైంది, ఉరీ సైనిక శిబిరంపై జరిగిన దాడి అనంతరం అందుకు ప్రతిగా ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది అంతకు మించి కామెంట్ చేయలేను అని అన్నారు. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంట ఉద్రిక్త పరిస్థితి నెలకొందని, ఆ వివరాలను డీజీఎంఓ ఇప్పటికే తన ప్రకటనలో వివరించారని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే... ఉరీ సైనక స్థావరంపై దాడి నిఘా వైఫల్యమేనా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన పారికర్... "రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొని ప్రమాదం జరిగినప్పుడు, ఎవరో ఒక డ్రైవర్‌ ది కచ్చితంగా తప్పు ఉంటుంది. యాక్సిల్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం చాలా అరుదుగా జరుగుతుంటుంది" అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
 
ఇదే క్రమంలో ఒకదేశంతో మరో దేశం సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఆ దేశం ఇంకొకరితో సన్నిహితంగా ఉండకూడదనేమీ లేదని పాక్‌ కు చైనా వత్తాసు పలుకుతుండటంపై స్పందించారు పారికర్. ఏళ్ల తరబడి చైనా, భారత్ సంబంధాలు ఇవాల్టికి మెరుగ్గా ఉన్నా కొన్ని విషయాల్లో ఆందోళనలు ఉన్నమాట కూడా నిజమే అని అయితే చైనాతో భారత్ సరిహద్దు నిర్వహణ కొంతవరకూ మెరుగ్గానే ఉందని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News