అన్న‌ద‌మ్ముల్లా పెరిగితే..మ‌న ప‌త్రిక‌లో హ‌రీశ్ ఫోటో రాదేం?

Update: 2018-10-05 04:19 GMT
నిజం మాట ఎలా ఉన్నా.. చెప్పే అబ‌ద్ధం అతికిన‌ట్లుగా ఉండాలంటారు.  దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తారు తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి కేటీఆర్. ఎందుకంటే..  తాజాగా ఆయ‌న చెప్పిన‌ మాట‌లు అతికిన‌ట్లే ఉన్నా.. లాజిక్ ముందు మాత్రం తేలిపోయాయి మ‌రి. 

త‌న‌కు.. హ‌రీశ్ కూ మ‌ధ్య లొల్లి ఉంద‌ని.. సైలెంట్ వార్ న‌డుస్తుంద‌న్న మాట ఇప్ప‌టిది కాదు.. ఏళ్ల‌కు ఏళ్లుగా న‌డుస్తోంది. గులాబీ పార్టీలో ఇదో బ్ర‌హ్మ‌ప‌దార్థంగా అభివ‌ర్ణించే వారు లేక‌పోలేదు. ఇలాంటి మాట‌ల్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. బ‌హిరంగ వేదిక‌ల మీద అప్పుడ‌ప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య న‌డిచే సెంటిమెంట్ సీన్లు ఓ రేంజ్లో పండుతుంటాయి. తాజాగా అలాంటి పంట‌నే పండించేందుకు చాలానే క‌స‌ర‌త్తు చేశారు కేటీఆర్.

హ‌రీశ్‌.. త‌న‌కు మ‌ధ్య అధిప‌త్య పోరు న‌డుస్తుందన్న మాట‌ల్ని సింఫుల్ గా కొట్టిపారేసిన ఆయ‌న‌.. అలాంటి దుర్మార్గ‌పు మాట‌లు మాట్లాడ‌తారా?  త‌మ లాంటి అన్న‌ద‌మ్ముల అనుబంధం గురించి త‌ప్పుగా మాట్లాడితే క‌ళ్లు పోతాయ్ లాంటి మాట‌లు చెప్ప లేదు కానీ.. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా అలాంటి మాట‌లే చెప్పాలి. పేరుకు బావా బావ‌మ‌రుదులం అయిన‌ప్ప‌టికీ చిన్న‌ప్ప‌టి నుంచి అన్న‌ద‌మ్ముల్లా పెరిగామ‌న్నారు.

నిజ‌మే.. ఒక వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ అమ్మాయిలు అయితే అక్కా.. అబ్బాయిలు అయితే అన్న అనే స్కూల్ పిల్ల‌ల మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే కేటీఆర్ మాట‌లున్నాయి. అరే.. ఓపెన్ గా వేలాది మంది ముందు త‌మ మ‌ధ్య లొల్లి లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన త‌ర్వాత కూడా న‌మ్మ‌రా? అని అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. కేటీఆర్ మార్క్ సెంటిమెంట్ సెంట్ సువాస‌న గుప్పుమ‌న్నా.. అందులో ఏదో లోపం ఉన్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. నిజ‌మే.. కేటీఆర్ అంత‌గా అన్న‌ద‌మ్ముల సెంటిమెంట్ ను బ‌య‌ట‌కు తీస్తే.. అన్ని తెలిసిన హ‌రీశ్ రావు మాత్రం న‌వ్వుతూ.. కేటీఆర్ వంక చూస్తూ ఉండ‌టం కొంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

అంతేనా.. కంటికి క‌నిపించే ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మ‌రింత అన్న‌ద‌మ్ముల అనుబంధం హ‌రీశ్‌.. కేటీఆర్ ల మ‌ధ్య ఉండి ఉంటే.. గులాబీ పార్టీ అధికార ప‌త్రిక లో కేసీఆర్‌.. కేటీఆర్‌.. క‌విత‌ల ఫోటోల‌కు.. వారి వార్త‌ల‌కు వ‌చ్చే ప్ర‌యారిటీ.. హ‌రీశ్ రావు వార్త‌ల‌కు ఎందుకు రాన‌ట్లు? అన్న క్వ‌శ్చ‌న్ కు మాత్రం స‌మాధానం దొర‌క‌ని పరిస్థితి. అంతేనా.. వార్త‌ల సంగ‌తి వ‌దిలేద్దాం.. గ‌డిచిన అర్నెల్ల కాలంలో హ‌రీశ్ ఫోటో వారి సొంత ప‌త్రిక‌ల్లో మొద‌టి పేజీలో ప‌డిన ప‌రిస్థితి ఉందా? అన్న క్వ‌శ్చ‌న్ వేసుకుంటే స‌మాధానం సింఫుల్ గా దొర‌క‌ట‌మే కాదు.. సెంటిమెంట్ సెంట్ లో మిస్ అయిన సువాస‌న ఏమిటో ఇట్టే అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News