అయోధ్య వద్దు.. రుణమాఫీ ముద్దు

Update: 2018-11-30 09:08 GMT
అన్నదాతల నినాదాలతో హస్తిన హోరెత్తింది కర్షకులు కదం తొక్కడంతో ఢిల్లీ వీధుల వేదిక‌గా అన్న‌దాత‌ల ఆవేద‌న మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది.  పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న తమకు రుణమాఫీ చేయాలని - ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశం నలుమూలల నుంచి అన్నదాతలు ఢిల్లీకి భారీగా తరలివచ్చి తమ డిమాండ్లపై ఢిల్లీ పురవీధుల్లో నిరసన గళం వినిపించారు. తమకు అయోధ్య వద్దని - రుణమాఫీ కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. రెండు రోజుల నిరసన ప్రదర్శనల్లో భాగంగా గురువారం వారంతా ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానానికి తరలివచ్చారు. పంజాబ్ - హర్యానాల నుంచి పాదయాత్రగా అన్నదాతలు అక్కడికి చేరుకోవడంతో ఢిల్లీ నగరం ఎరుపెక్కింది. చారిత్రక రామ్‌లీలా మైదానం ఎర్రసముద్రాన్ని తలపించింది. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు లక్ష మంది రైతులు ఢిల్లీకి వచ్చినట్లు రైతు సంఘాల నేతలు చెప్పారు.

207 రైతు - రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో గతేడాది ఏర్పాటైన అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌ సీసీ) నేతృత్వంలో కిసాన్ ముక్తి మార్చ్ పేరుతో ఈ ర్యాలీ జరుగనుంది. ఈ సందర్భంగా ఏఐకేఎస్ నేత అతుల్ అంజాన్ తదితరులు మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం రుణమాఫీని ప్రకటించాలని - పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు మైదానంలోనే విశ్రమించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీ వాటర్‌ బోర్డు - స్థానిక గురుద్వారాలు - ఆప్ కార్యకర్తలు - స్థానికులు - ఢిల్లీ వర్సిటీ విద్యార్థులు రైతులకు తాగునీరు, స్నాక్స్ - భోజన ప్యాకెట్లను అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం రామ్‌ లీలా మైదానం నుంచి పార్లమెంట్ వరకు రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

రామ్‌ లీలా మైదానానికి గురువారం మధ్యాహ్నానికే పెద్దసంఖ్యలో రైతులు చేరుకున్నారు. సాంస్కృతిక బృందాల ఆట - పాటలతో - వక్తల ప్రసంగాలతో మైదానం హోరెత్తింది. మీరు రైతులు కాకున్నా సరే కిసాన్ మార్చ్‌ కు మద్దతివ్వండి అని సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ర్యాలీపై స్పందిస్తూ మద్దతు ధర ప్రకటించాలని - రుణాల ఊబి నుంచి స్వేచ్ఛను ప్రసాదించాలని ఢిల్లీ వీధుల్లో కదం తొక్కనున్న రైతులకు మద్దతు ప్రకటిద్దాం అని ట్వీట్ చేశారు. కొన్నేండ్లుగా పంటలు పండిస్తున్నా వరదలు - కరువుతో తీవ్రంగా నష్టపోయామని జమున్ ఠాకూర్ అనే బీహార్ రైతు వాపోయారు. ఈ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోకి వాహనాల రాకపై ఆంక్షలు విధించారు.

ఇదిలాఉండ‌గా, తమిళనాడు రైతులు పుర్రెలతో ఢిల్లీ చేరుకున్నారు. నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్‌ లింకింగ్ అగ్రికల్చరలిస్ట్స్ అసోషియేషన్ నేతృత్వంలో 1,200 మంది తమిళనాడు రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరు తమతోపాటు మాన‌వ‌ పుర్రెలను కూడా తెచ్చారు. ఇవి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న తమ తోటి రైతులవని వారు చెప్పారు. గతేడాది జంతర్‌ మంతర్ వద్ద జరిగిన ధర్నాలోనూ తమిళనాడు రైతులు 8 మంది ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల పుర్రెలను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగే చలో పార్లమెంట్ ప్రదర్శనను పోలీసులు అడ్డుకుంటే వీధుల్లో నగ్న ప్రదర్శనలు నిర్వహిస్తామని తమిళ రైతులు హెచ్చరించారు. రైతులకు నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News