బాబుకు రూ.5వేల కోట్లు కావాలట

Update: 2016-11-26 05:51 GMT
బాబుకు రూ.5వేల కోట్లు కావాలట
  • whatsapp icon
నోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర నోట్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రజల అవసరాలకు తగినంత కరెన్సీని అందుబాటులో ఉంచటంలో కేంద్రం విఫలమైందన్న విమర్శ వినిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కరెన్సీ కష్టాలు రోజురోజుకీ అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో.. బ్యాంకులు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. నగదు మార్పిడి పూర్తిగా బంద్ కావటం.. ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల్ని ఆశ్రయించటం తెలిసిందే. నోట్ల మార్పిడిపై పరిమితులు భారీగా ఉండటంతో తమ వద్దనున్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేశారు.

అలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించటం.. అందుకు తగ్గట్లుగా బ్యాంకుల వద్ద కరెన్సీ లేకపోవటంతో కొరత ఏర్పడింది. రాష్ట్రాలకు అవసరమైన కరెన్సీని అందుబాటులోకి తెచ్చే విషయంలో ఆర్ బీఐ విఫలమైంది. దీంతో.. కరెన్సీ కష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ అధికారుల్ని ఆర్ బీఐ వద్దకు పంపి.. ఒత్తిడి చేసి మరీ కరెన్సీని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వ్యక్తిగత శ్రద్ధతో కరెన్సీ నోట్ల కోసం ఒత్తిడి చేయటం కోసం మొన్న ఆదివారం కొంత మొత్తం ఏపీకి వచ్చింది.

అయితే.. కరెన్సీకి ఉన్న భారీ డిమాండ్ కారణంగా..ఆర్ బీఐ నుంచి బ్యాంకులకు వస్తున్న కరెన్సీ ఏ మాత్రం సరిపోవటం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఖాతాదారుడు వారానికి రూ.24 వేల మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వీలుంది. కానీ.. కరెన్సీ కొరత కారణంగా ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదు. తమకున్న నగదు లభ్యతను చూసుకుంటున్న బ్యాంకులు ప్రతి విత్ డ్రాకు రూ.2 వేల నుంచి రూ.5వేల మధ్యలో మాత్రం విత్ డ్రాకు అనుమతిస్తున్నారు.

చిన్న చిన్న మొత్తాల్లో చేతికి అందుతున్న మొత్తం.. రోజువారీ ఖర్చులకు త్వరగా అయిపోవటం ఒక ఎత్తు అయితే.. నోట్ల రద్దు సమయంలో చేతిలో డబ్బులు లేక చాలామంది తాము చెల్లించాల్సిన మొత్తాల్ని చెల్లించకుండా అప్పుగా రాసుకోమన్న పరిస్థితి. అందరూ ఊహలకు బిన్నంగా నోట్ల కొరత నాలుగైదు రోజులు దాటి.. ఏకంగా పదహారు రోజులు దాటుతున్నా ఇబ్బందులు అంతకంతకూ పెరగటమే కానీ.. తగ్గని దుస్థితి.దీంతో.. చిల్లర నోట్లు అందరికి అవసరమవుతున్నాయి. దీంతో.. బ్యాంకుల వద్ద క్యూలు పెరిగిపోవటంతో పాటు.. కరెన్సీకి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

డిమాండ్ కు తగ్గట్లు కరెన్సీ సరఫరా లేకపోవటంతో బ్యాంకులు సైతం.. చిన్న చిన్న మొత్తాల్ని మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇలా పరిస్థితులకు తగ్గట్లుగా మేనేజ్ చేస్తున్నప్పటికీ.. ఏపీలో కరెన్సీ నిల్వలు పూర్తిగా అడుగంటినట్లుగా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికప్పుడు ఆర్ బీఐ కానీ స్పందించకుంటే తీవ్ర సమస్యలు ఎదురుకావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు అవసరమైన కరెన్సీ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు.

తమకు అత్యవసరంగా రూ.5వేల కోట్ల కరెన్సీ అవసరమని.. త్వరగా పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో రూ.100 కంటే తక్కువ విలువైన నోట్లను రూ.500 కోట్ల వరకూ విలువ ఉన్న నగదును పంపాలని.. రూ.500 నోట్లను వెయ్యి కోట్ల వరకూ పంపాలని.. మిగిలిన మొత్తానికి ఇతర నోట్లు పంపాలని బాబు కోరుతున్నారు. మరి.. బాబు డిమాండ్ పై ఆర్ బీఐ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News