ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్న కాంగ్రెస్

Update: 2016-10-07 09:39 GMT
అనువు కాని వేళ అధికులమనరాదన్న సూక్తి కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలీదా? అన్న సందేహం కలుగుతోంది తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేయటం.. ఉగ్రవాదుల్ని.. వారికి దన్నుగా నిలిచిన పాక్ సైనికులను నిర్మూలించటం ద్వారా పాక్ కు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతటి సాహసోపేతమైన  నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీని దేశమంతా మెచ్చుకుంది. ఎవరిదాకానో ఎందుకు.. గడిచిన రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా మోడీని పొగడని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం.. తనకు తొలిసారి మోడీతో మాట్లాడాలని ఉందంటూ తన స్పందనను చెప్పేశారు. భారత్ జరిపిన సర్జికల్ దాడులపై కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాంధీ సైతం సానుకూలంగా స్పందించారు.

సర్జికల్ దాడుల ఇష్యూలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేయాలో అదే చేసినప్పటికీ.. అనుచర వర్గం.. కొందరు నేతలు ఏ మాత్రం దూరదృష్టి లేకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అంతేనా.. పార్టీ పరువుపోయే పరిస్థితిని తీసుకొచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్జికల్ దాడుల అనంతరం మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోవటం.. బీజేపీ ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోవటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు సన్నాయి నొక్కులు మొదలెట్టారు. మోడీ హయాంలో జరిగినట్లే.. కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర సర్కారు సైతం గతంలో పలుమార్లు సర్జికల్ నిర్వహించిందంటూ బడాయి మాటలు చెప్పుకున్నారు.

దీంతో.. సర్జికల్ దాడుల వ్యవహారంలో రాజకీయం చొరబడిన పరిస్థితి. యూపీఏ హయాంలో పాక్ తో భారత్ ఏ తీరులో వ్యవహరించిందన్న విషయం అందరికి తెలిసిన విషయమే కావటంతో.. కాంగ్రెస్ వాదనకు పెద్ద ప్రచారం లభించలేదు. చాలామంది నవ్వి ఊరుకున్న పరిస్థితి. అయితే.. మాజీ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా మాత్రం మిగిలిన వారి మాదిరి మౌనంగా ఉండకుండా.. పెదవి విప్పి.. కాంగ్రెస్ మీద భారీ ఆరోపణల‌ బాంబును వేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన దాడులకు.. ప్రస్తుత సర్జికల్ దాడులకు ఏ మాత్రం పోలిక లేదని తేల్చిన ఆయన.. కాంగ్రెస్ సర్కారు హయాంలో జరిగినవి సరిహద్దుల వెంట మామూలుగా జరిగే దాడులని అసలు విషయాన్ని చెప్పేశారు.

అప్పట్లో జరిగిన దాడులు మామూలేనని.. ఇప్పుడు జరిగిన దాడులు మాత్రం నిర్దేశిత లక్ష్యాల్ని పెట్టుకొని మరీ చేసినవని.. ఇవి చాలా సున్నితమైనవని.. తాజాగా జరిపిన దాడులతో మన సైనికులు ఎంత నైపుణ్యంతో పని చేస్తారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లుగా పేర్కొన్నారు.  కాంగ్రెస్ హయాంలో జరిగిన దాడులకు.. మోడీ హయాంలో జరిగిన దాడులకు సంబంధం లేదని.. తాను రాజకీయాల జోలికి వెళ్లటం లేదని చెప్పిన ఆయన.. ప్రస్తుత దాడిలో మన జాతీయశక్తిలోని ఆర్థిక.. దౌత్య.. సమాచార యుద్ధతంత్రం లాంటివెన్నో అంశాలు ఉన్నాయంటూ చెప్పిన మాటలు కాంగ్రెస్ కు మిగిలిన కొద్దిపాటి పరువు ప్రతిష్ఠల్ని మంటకలిపేదిగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగదునమ్మా అంటూ ప్రతి విషయంలోనూ పేరు కోసం పాకులాడితే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News