కేసీఆర్‌కు అండ‌గా ఉంటాం.. : కేర‌ళ సీఎం

Update: 2023-01-18 15:26 GMT
కేంద్రంపై పోరు ప్రారంభించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు తాము అండ‌గా ఉంటామ‌ని.. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌క‌టించారు. ఖ‌మ్మంలో నిర్వ‌హించిన బీఆర్ ఎస్ ఆవిర్భావ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. మోడీ తీరుతో దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడిందని.. సామాన్యులు బతికే పరిస్థితులు లేవన్నారు.  

కేంద్ర వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు.  ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోం దని తెలిపారు. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్‌ నడుం బిగించారని, ఆయ‌న‌కు అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. తెలంగాణ తరహాలోనే కేరళ కూడా అనేక పథకాలు అమ‌లు చేస్తోంద‌ని తెలిపారు.  

''తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది.  కార్పొరేట్‌ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది. కేంద్ర వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది. వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌, వన్‌ నేషన్‌ -వన్‌ ఎలక్షన్‌ వంటి నినాదాలు సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి`` అని విజ‌య‌న్ మండిప‌డ్డారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయని విజయన్‌ ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కబళిస్తోందని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీనపరుస్తోందని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూలదోస్తోందని వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది దేశ విశిష్టత అని వివరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News