కేసీఆర్ ఆర్డ‌ర్‌...మాస్క్ పెట్టుకోండి లేదా ఫైన్ క‌ట్టండి

Update: 2020-05-18 16:15 GMT
కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుద‌ల చేసిన నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ రాష్ట్రంలో లాక్ డౌన్ అమ‌లుపై క‌స‌ర‌త్తు పూర్తి చేశారు. కేబినెట్‌ సమావేశం నిర్వ‌హించిన కేసీఆర్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా అనేక‌ వెసుల‌బాట్లు క‌ల్పించి ప‌లు ష‌ర‌తులు కూడా విధించారు.

కరోనాకు వ్యాక్సిన్‌ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించిందని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాతో జీవించడం నేర్చుకోవాలని సూచించారు. బ్ర‌తికి ఉంటే బ‌లుసాకు తిన‌వ‌చ్చ‌ని గ‌తంలో తానే చెప్పాన‌ని పేర్కొన్న తెలంగాణ సీఎం బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చున‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని వివ‌రించారు.

నిబంధ‌న‌ల సడ‌లింపు ఇచ్చార‌ని అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. వృద్ధులు, చిన్నవారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరారు. ప్రజలందరూ ఇప్ప‌టివ‌ర‌కూ చక్కటి సహకారం అందిస్తున్నారని, వారందరికీ చేతులెత్తి మొక్కుతున్నట్లు తెలిపారు. స్వీయ నిర్బంధం పాటించి కరోనా రాకుండా కాపాడుకుందామ‌న్నారు. ఆయా ప‌నుల రీత్యా బ‌య‌ట‌కు వ‌చ్చేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ మాస్కులు ధ‌రించ‌ని ప‌క్షంలో రూ.1000 ఫైన్ వేయ‌బ‌డుతుంద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.
Tags:    

Similar News