రాజీనామా సమయాన వివాహ విందు.. ఇలాంటివి ఆ అధినేతకే సాధ్యం!

Update: 2022-07-09 05:00 GMT
ఒక సంపన్న.. పవర్ ఫుల్ దేశానికి అధినేతగా వ్యవహరించే నేత.. సహచరుల ఒత్తిడివేళ.. తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వస్తే.. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఇబ్బందికరమైన వేళలో.. వివాహ విందు ఏర్పాటు చేయటం అందరికి సాధ్యం కాదు. అది కూడా భారీగా అంటే.. ఇలాంటి నేత చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. అలాంటి విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.

సొంత పార్టీ నుంచి ఎదురైన వ్యతిరేకత నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన బోరిస్ జాన్సన్.. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆయన ఆ పదవిలో ఉండనున్నారు. వ్యాపారం వ్యాపారమే.. వ్యవహారం వ్యవహారమే అన్న చందంగా.. రాజకీయంగా తాను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ. .వ్యక్తిగతంగా తన వివాహ విందును ఏర్పాటు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివాహ విందు కూడా.. తాను పెళ్లాడిన కారీ జాన్సన్ తో వివాహ బంధం ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఈ వేడుకకు చెకర్స్ భవనం వేదిక కానున్నట్లుగా బ్రిటన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి.

బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించే వారు వారి అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ తో పాటు చెకర్స్ భవనాన్ని వినియోగించుకునే సంప్రదాయం ఉంది.

ఈ రెండు భవనాల్లో వేడుకలు.. ప్రపంచ నేతలకు అతిధ్యం లాంటివి ఇస్తుంటారు. 600 హెక్టార్లలో విస్తరించి ఉంటే ఈ ఎస్టేట్ లో తాజా వేడుక జరగనుంది. వాస్తవానికి కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ప్రధానమంత్రి పదవిలో ఉండటం అంటే..

అపధర్మ ప్రధానిగా ఉన్నట్లే. అధికారికంగా కాకున్నా అనధికారికంగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి.. వ్యక్తిగతమైన వివాహ వేడుకకు సంబంధించిన పార్టీ ఏర్పాటు చేయటం.. అది కూడా అట్టహాసంగా ఉండటం విశేషం. గత ఏడాది కరోనా వేళలో అతి కొద్ది సమక్షంలో ఆయన కారీని పెళ్లాడిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News