బంటు నోరుజారితే బాస్‌ ను వాయించేశారు!

Update: 2015-09-23 04:02 GMT
'సైన్యంబు చెడుగైన దండనాధుని తప్పు... గుర్రంబు చెడుగైన రౌతు తప్పు' అంటూ నరసింహ శతకంలోని నీతి మనకు బోధిస్తుంది. టీంలో ఒక మెంబర్‌ తప్పుచేస్తే.. టీంలీడర్‌ దాని తాలూకు బాధ్యత వహించాల్సిదే. ఇప్పుడు పాపం.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు అలాంటిచిక్కులే వచ్చి పడ్డాయి. తమ పార్టీకి సంబంధించిన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర నాయకుడు ఒరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి.. ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కోవలసి వస్తోంది. వివరణ ఇచ్చుకోవలసి వస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో.. నాయకులు కొన్ని నిబంధనలను అతిక్రమిస్తూ ఉండడం.. అలాంటి వాటికి సంబంధించి ఈసీ ముందు లెంపలేసుకుని.. క్షమాపణ చెప్పేస్తూ ఉండడం మామూలే. కానీ.. ఈసారి తీవ్రమైన తప్పే జరిగింది. పైగా ఆ తప్పు వెస్ట్‌ బెంగాల్‌ నాయకుడెవరో చేస్తే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా లెంపలేసుకునే పరిస్థితి దాపురించింది.

వివరాల్లోకి వెళితే.. 'ఎన్నికల సంఘం ఇప్పుడు తమ పార్టీ కంట్రోల్ లో ఉన్నదంటూ' వెస్ట్‌ బెంగాల్‌ కు చెందిన భాజపా నాయకుడు జాయ్‌ బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈసీ చిత్తశుద్ధికి, విశ్వసనీయతకు గొడ్డలిపెట్టు ఈ వ్యాఖ్య చాలా తీవ్రమైనది కావడంతో పెద్ద వివాదమే రేగింది. బెనర్జీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం అమిత్‌ షాకు లేఖ రాసింది. అలాగే వచ్చే ఏడాది.. ఆ రాష్ట్రంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భద్రత ఏర్పాట్ల మీద కూడా జాయ్‌ బెనర్జీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటి గురించి కూడా ఇప్పుడు అమిత్‌ షా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఇప్పటికే.. భాజపా ఈ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం మొదలెట్టింది. జాయ్‌ బెనర్జీ ఆయన వ్యక్తిగత స్థాయిలో ఆ వ్యాఖ్యలు చేశారని.. వాటితో పార్టీకి సంబంధం లేదని.. పార్టీ ప్రకటించింది. బెనర్జీ ''సీ తన నియంత్రణలో ఉన్నదని'' వ్యాఖ్యానించి ఉంటే ఇలా బుకాయించడానికి వీలుండేది. అలా కాకుండా.. ఆయన తమ పార్టీ కంట్రోల్ లో ఉన్నదని చెప్పిన తర్వాత.. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? ఆయనను పార్టీనుంచి బయటకు పంపినా ఒకవేళ తమను తాము సమర్థించుకోవడం కుదురుతుంది. వివరణ ఇచ్చేముందు అమిత్‌ షా ఈ అంశాలన్నిటినీ బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News