మెగా ఫ్యామిలీకి మ‌ళ్లీ సొంత జిల్లా షాక్!

Update: 2019-05-24 08:39 GMT
పుట్టిన ఊరు.. సొంత ప్ర‌జ‌లంటే ఎంత‌టి వారికైనా ప్ర‌త్యేక అభిమానం ఉంటుంది. ఆ త‌ర్వాత సొంత జిల్లా మీద అభిమానం ఎక్కువే. ఏం సాధించినా సొంత ప్రాంతంలో త‌మ పేరు ప్ర‌ఖ్యాతులు వ్యాప్తి చెందితే ఎంత‌టివారైనా మురిసిపోతుంటారు. దేశానికి రాజు అయిన‌ప్ప‌టికీ.. ఊరికి మాత్రం బిడ్డే అవుతుంటారు. అందుకే.. సొంత జిల్లా మీద‌.. సొంత ప్రాంతం మీద అభిమానం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే.. మెగాస్టార్ ఫ్యామిలీకి మాత్రం సొంత జిల్లా ఎప్పుడూ అచ్చిరాలేదు. సొంత జిల్లాను న‌మ్ముకున్న ప్ర‌తిసారీ వారికి షాకులు త‌గిలే ప‌రిస్థితి.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత జిల్లా అయిన ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఆయ‌న.. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు బ‌రిలో నిలిచారు. అనూహ్యంగా ఇద్ద‌రు ఓట‌మిపాల‌య్యారు. ఈ చేదు అనుభ‌వం వారికిది మొద‌టిసారి కాదు. ప‌వ‌న్ సోద‌రుడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సంద‌ర్భంలోనూ రెండుస్థానాల నుంచి పోటీ చేశారుచిరు. అందులో ఒక‌టి తిరుప‌తి అయితే.. మ‌రొక‌టి పాలకొల్లు. తిరుప‌తిలో విజ‌యం సాధించిన చిరు.. సొంత జిల్లా అయిన పాల‌కొల్లులో సంచ‌ల‌న ఓట‌మికి గుర‌య్యారు.

తాజాగా ప‌వ‌న్ భీమ‌వ‌రం నుంచి పోటీ చేస్తే.. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఇద్ద‌రిని సొంత ప్రాంత ప్ర‌జ‌లు ఓడించ‌టం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. త‌మ‌కున్న ఛ‌రిష్మాతో పాటు.. సొంత జిల్లా సెంటిమెంట్ తో పాటు.. కాపు ఓట్లు క‌లిసి వ‌స్తాయ‌ని భావించారు.

కానీ.. అవేమీ వ‌ర్క్ వుట్ కాలేదు స‌రికాదా.. ఓడిపోయిన దుస్థితి. అయినా.. కులాన్ని తాను న‌మ్మ‌న‌ని చెప్పే ప‌వ‌న్‌.. కులం ఓట్ల కోసం కావాల‌ని బ‌రిలో దిగ‌టం ధ‌ర్మం కాదుగా. ప‌వ‌న్ ధ‌ర్మంగా లేకున్నా.. ఆయ‌న సొంత ప్ర‌జ‌లు ధ‌ర్మాన్ని అనుస‌రించి.. త‌మ తీర్పును ఇచ్చేశారు. మ‌రి.. రానున్న రోజుల్లోనూ సొంత ప్రాంతం మీద మ‌మ‌కారాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. అక్క‌డే పోటీ చేస్తారా?  లేక‌.. ఇక ఎప్ప‌టికి త‌మ సొంత జిల్లా వంక చూడ‌రా? అన్న‌ది కాలం మాత్ర‌మే స‌రిగా స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌దు.  
    

Tags:    

Similar News