పరీక్షా పేపర్ల లీకులేంటి బొత్స గారూ...?

Update: 2022-04-28 12:30 GMT
ఏపీలో వరసబెట్టి పరీక్షల పేపర్లు లీకు అవుతున్నాయి. లేటెస్ట్ గా ఎనిమిదవ తరగతి సైన్స్ పేపర్ టెలిగ్రాం యాప్ లో లీక్ అయింది. అలాగే టెన్త్ పరీక్ష పత్రం హిందీ ఉమ్మడి విశాఖ జిల్లా రోలుగుంటలో లీక్ అయినట్లుగా వార్తలు వచ్చాయి.

చిత్తూరు జిల్లాలో తెలుగు పేపర్ లీక్ అయిందని అంటున్నారు. టెన్త్ పేపర్లు లీకులు పరీక్ష మొదలైన తరువాత జరుగుతూంటే మిగిలిన పరీక్షల పేపర్లు మాత్రం ప్రతీ రోజూ లీక్ అవుతూనే ఉన్నాయి.

దీని మీద జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను నిలదీశారు. ఈ లీకులేంటి బొత్స గారూ అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేదని, ఈసారి మాత్రం పరీక్షల పేపర్లు లీకు అవుతూంటే విద్యా శాఖ ఏం చేస్తోందని కూడా ఆయన నిలదీశారు.

పారదర్శక పాలన అంటే ఇదేనా అని మంత్రికి బిగ్ క్వశ్చన్ వేశారు. పరీక్షలు జరగకముందే ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయంటే ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారో ప్రభుత్వం తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి పరీక్షల పేపర్ల లీకుల విషయం చూస్తే విపక్షాలకు ఆయుధంగానే ఉందని అంటున్నారు.

మరో వైపు తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఫస్ట్ టైమ్ పబ్లిక్  పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా అసలు పరీక్షలే జరగలేదు. ఈలోగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మారిపోయారు.

ఈ నేపధ్యంలో కొత్త విద్యా శాఖ మంత్రిగా బొత్స  ఇలా వస్తూనే అలా పరీక్షలు జరుగుతున్నాయి. మరి ఫస్ట్ టైమ్ పరీక్ష పాస్ కాకపోతే అది వైసీపీ సర్కార్ కి కొత్త  విద్యా శాఖ మంత్రికి కూడా ఇబ్బందే. ఇపుడు విపక్షాలు ఎటూ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి నోరు విప్పక తప్పదు, మరి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News