ఇం‍డోనేషియన్లు కరీంనగర్ లో అసలు ఏంచేస్తున్నారంటే ?

Update: 2020-03-21 12:30 GMT
తెలంగాణ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం తో ప్రజలలో ఆందోళన కూడా పెరిగిపోతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇండోనేషియన్ల పుణ్యమా అని కరోనా వైరస్ కరీంనగర్ కు పాకింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకుల బృందం లో 9మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన ఇండోనేషియన్లు కరీంనగర్ లో బస చేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే , అసలు ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులకి కరీంనగర్ లో ఏం పని ? అసలు ఎందుకు వచ్చారు? కరీంనగర్‌ రూరల్‌ ఏరియాలో పర్యటించిన బృందం ఇప్పుడెక్కడుంది..? వీరు గత నాలుగు నెలలుగా అక్కడ ఏంచేస్తున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో మెదులుతున్నాయి.

ఈ నెల 14న ఢిల్లీ నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌కు వచ్చి.. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్‌ వచ్చిన 10 మంది తో కూడిన ఇండోనేషియా బృందం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో బస చేసింది. వీరిలో 10 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. వీరి గురించి ఆరా తీసినప్పుడు ఇండోనేషియా బృందాలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించడం సర్వసాధారణమని తేలింది. ప్రార్థనా మందిరాలలో, స్థానికులను విచారించినప్పుడు ‘ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి... అక్కడి మత పెద్దల సూచనల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మత ప్రచారం సాగిస్తారని’ చెబుతున్నారు. కాగా గత నాలుగు నెలలుగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇండోనేషియా సభ్యులు బృందాలుగా విడిపోయి ఒక్కో ప్రార్థనా మందిరంలో రెండు మూడు రోజులు గడుపుతూ వస్తున్నట్లు తేలింది. అయితే , ఆ బృందాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదు.

వీరు జగిత్యాలతోపాటు సిరిసిల్ల జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. కోరుట్ల, మెట్‌ పల్లి, నిజామాబాద్‌ లలోని ప్రార్థనా మందిరాల్లో తిరిగిన వీరు అదే నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత మత సంస్థ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. జగిత్యాలకు వచ్చిన నాలుగు జంటల్లో మహిళలు మత పెద్దల ఇళ్లల్లో ఉండగా, పురుషులే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. జగిత్యాల ఎస్‌పీ సింధూశర్మ దీనిపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా తాజాగా హైదరాబాద్‌ లోని ఆసిఫ్‌ నగర్‌ లో నాలుగు జంటల బృందం పర్యటిస్తుండగా, స్థానికుల సమాచారంతో వారిని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి క్వారంటైన్‌ కు తీసుకెళ్లి పరీక్షలు జరిపారు. వీరు ఫిబ్రవరిలోనే కరీంనగర్‌ వచ్చినట్లు ఒప్పుకోవడం గమనార్హం.

మొత్తంగా రెండు నెలల వ్యవధిలో మూడు నుంచి నాలుగు బృందాలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ పోలీస్‌ అధికారిని ప్రశ్నిస్తే... ఇండోనేషియా నుంచి వచ్చే మత ప్రచారకులు ఢిల్లీ చేరుకొని అక్కడ మత పెద్దలను కలుస్తారు. వారు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళతారు. రైళ్లు, వ్యాన్‌లు, ఆటోల్లోనే దేశంలో పర్యటిస్తారు. కరీంనగర్‌కు రావడం సాధారణమే అయినా ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి అని తెలిపారు.
Tags:    

Similar News