అమరావతి భూ ఆరోపణలపై నారాయణ ఏం చెప్పారు?

Update: 2022-05-19 02:49 GMT
ఏపీ రాజధాని అమరావతిని ఎంపిక నాటి చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం వేళ.. దానికి సంబంధించిన అన్నీ తానై వ్యవహరించిన నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు నారాయణపై భూ ఆరోపణలు పెద్ద ఎత్తున రావటం తెలిసిందే. ఇటీవల జగన్ సర్కారు సైతం ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నారాయణ.. తన అఫిడవిట్ లో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డుకు తాను అంగుళం భూమిని కూడా సేకరించలేదని.. అలాంటిప్పుడు అనుచిత లబ్థి ప్రశ్నే తలెత్తదన్నారు. అమరావతికి చెందిన ప్లానింగ్..ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ కేసులు నమోదు చేయటం తెలిసిందే. దీనికి సంబంధించిన పిటీషన్ లో ఆయన తన వాదనలు వినిపించారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార ఎజెండాతోనే రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో ఇరికించి వేధింపులకు గురి చేస్తుందన్నారు.


తాను టార్గెట్ చేసిన వారిని జైలుకు పంపి ప్రజల్లో వారి ప్రతిష్ఠను దిగజార్చుతున్నట్లుగా పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఐడీ తప్పుడు కేసులు నమోదు చేస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం పగ తీర్చుకోవటంలో భాగంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందన్నారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 27న సీఐడీకి కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే. అమరావతి ప్రణాళిక డిజైనింగ్.. ఇన్నర్ రింగ్ రెడ్డు.. దానిని లింకు చేసే రహదారుల అలైన్ మెంట్ విషయంపై అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లుగా ఆరోపిస్తూ ఆళ్ల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలువురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

అమరావతి కోసం సిద్ధం చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డును జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. 2020 నుంచే అమరావతి మాస్టర్ ప్లాన్ ను బుట్టదాఖలు చేసిందన్నారు. ఒక్క అంగుళం భూ సేకరణ జరగలేదని.. అలాంటప్పుడు ఈ ఇష్యూలో కొందరికి అనుచిత ప్రయోజనం కల్పించారన్న ప్రశ్నే తలెత్తదన్నారు. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయటం కోసమే ఇలా చేస్తున్నారన్న నారాయణ.. ‘‘ఒక హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. నాకు.. నా కుటుంబ సభ్యులకు సదరు హౌసింగ్ సంస్థతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు.

అనుమానంతోనే ఈ ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ఆరేళ్ల ఎనిమిది నెలల అసాధారణ జాప్యం ఉంది. కంప్లైంట్ లో ఆలస్యానికి కారణం చెప్పకుండా ఆరోపణలు చేయటం సరికాదు. పేరు ప్రతిష్టల్ని దెబ్బ తీయటం కోసమే ఇదంతా చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.మరి.. దీనిపై ఏపీ హైకోర్టు ఏ రీతిలో రియాక్టు కానుందన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి నారాయణతో పాటు.. లింగమనేని రమేశ్.. రామక్రిష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కేవీపీ అంజనీకుమార్ వేర్వురుగా వ్యాజ్యాలు వేశారు. వీటికి సంబంధించిన వాదనల్ని ఈ రోజు (గురువారం) విననున్నారు.
Tags:    

Similar News