జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సీఎం తాజాగా ఏం చెప్పారు?

Update: 2021-12-09 07:39 GMT
గడిచిన మూడు నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మీద. దీనిపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతుంటే.. అందుకు భిన్నంగా స్పందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీన్ని గుర్తించిన విపక్షం.. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది. ఇదిలా ఉండగా.. ప్రజల్లో ఈ పథకంపై పెరుగుతున్న నెగిటివిటీని తగ్గించి.. దీనిపై పూర్తి అవహనాన కల్పించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు.

తాజాగా అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్య చేశారు. ఆయన మాటల్ని చూస్తే.. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో నిర్ణయాన్ని తీసుకుంటే.. దానికి లేనిపోని అపోహల్ని అంటకడుతున్నారన్నట్లు ఆయన తీరు ఉంది. పేదలకు మంచి అవకాశంగా అభివర్ణిస్తున్న ఆయన.. దాన్ని వాడుకుంటారో లేదో ప్రజల ఇష్టంగా తేల్చేయటం గమనార్హం. కీలక పథకం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి.

అపోహలకు గురైతే వాటిని పటాపంచలు అయ్యేలా చేయాలి.

అంతేకానీ.. ఇలా ప్రజల ఇష్టమంటూ చేసిన షాకింగ్ వ్యాఖ్య కూడా చర్చకు నిలుస్తోంది. తాజాగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

- ఓటీఎస్‌ పథకం ద్వారా అన్ని రకాలుగా హక్కులిస్తున్నాం. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు. అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది. పేదలకు మంచి అవకాశం ఇది. దీనిని వాడుకోవాలా లేదా అన్నది వారి ఇష్టం.

- ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛందం. ఈ పథకంతో ఏ రకంగా మంచి చేకూరుతుందనేది ప్రజలకు విడమరిచి చెప్పింది. ఓటీఎస్ లో చేరితే క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది. సుమారు రూ.10 వేల కోట్ల రూపాయల రుణ భారం తొలగిపోతుంది. వారి రుణాలన్నీ మాఫీ చేస్తున్నాం, రిజిస్ర్టేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నాం.

- వారికి సంపూర్ణ హక్కులు వస్తాయి. ఈ విషయాలన్నీ వివరించండి. ఈ పథకం అమలు కాకుండా చాలా మంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలోనే అసలు, వడ్డీ కూడా కట్టారు.

- ఇప్పుడు మాట్లాడుతున్న వారు... అప్పుడు ఎందుకు కట్టించుకున్నారు? గతంలో అసలూ, వడ్డీ కడితే బీ-ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని రకాలుగా హక్కులు ఇస్తున్నాం. ఈనెల 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది.

- గత ప్రభుత్వ హయాంలో ఇంటి రుణాలు చెల్లించినవారికి కూడా రిజిస్ట్రేషన్‌ చేయిస్తామనీ, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతాయి.

- 22-ఏ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం.ఓటీఎస్‌ వినియోగించుకున్న వారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం.

- ఓటీఎస్‌ వినియోగించుకున్న వారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, ఫీల్డ్‌స్కెచ్‌, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నాం. గృహనిర్మాణం పై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకోవాలి.


Tags:    

Similar News