ఎంపీల‌కు జ‌గ‌న్‌ ఏం చెప్పారు?

Update: 2019-06-15 12:01 GMT
ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో పాల్గొన్నారు. కొద్ది గంట‌ల క్రితం ముగిసిన ఈ భేటీలో పార్టీ ఎంపీలు పార్ల‌మెంటులో అనుస‌రించాల్సిన వ్యూహాల గురించి దిశానిర్దేశం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 17 (సోమ‌వారం) నుంచి సాగే పార్ల‌మెంటు స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహం మీద‌.. ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై ఉభ‌య స‌భ‌ల్లో అనుస‌రించాల్సిన విధానంపైనా ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన ఎంపీల‌కు వివ‌రించారు. పార్ల‌మెంటులో నాలుగో అతి పెద్ద పార్టీగా త‌మ పార్టీ ఉంద‌ని.. దీన్నో అవ‌కాశంగా భావించి.. త‌మ‌కున్న సంఖ్యా బ‌లాన్ని అనుస‌రించి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న హామీల‌పై ఫ‌లితాలు రాబ‌ట్టాల‌ని కోరారు.

ఏపీకి చెందిన ఎంపీలంటే గౌర‌వ మ‌ర్యాద‌లు పెరిగేలా నేత‌ల తీరు ఉండాల‌ని స్ప‌ష్టం చేవారు. హుందాగా వ్య‌వ‌హ‌రించ‌టం.. స‌భా కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ‌గా పాల్గొనాల‌ని.. ఎంపీలుగా ఎక్కువ‌శాతం యువ‌కులు.. విద్యావందులు ఉండ‌టం వ‌ల్ల భాషా ప‌ర‌మైన స‌మ‌స్య రాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. శాఖ‌ల వారీగా ఎంపీలు విడిపోయి.. ఎవ‌రికి వారు వారి.. వారి శాఖ‌ల నుంచి రావాల్సిన నిధుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌న్నారు.

పార్ల‌మెంటు పార్టీ నేత‌గా విజ‌య‌సాయి రెడ్డి.. లోక్ స‌భ ఫ్లోర్ లీడ‌ర్ గా మిథున్ రెడ్డి స‌ల‌హాలు.. సూచ‌న‌ల‌తో స‌భా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనాల‌న్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌.. ఐక‌మత్యంతో పార్ల‌మెంటులో వ్య‌వ‌హ‌రించాల‌న్న జ‌గ‌న్‌.. నియోజ‌క‌వ‌ర్గాల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని స్టాండింగ్ క‌మిటీల‌ను ఎంపిక చేసుకోవాల‌న్నారు.  పార్ల‌మెంటులో ఎంపీలు చేయాల్సిన అంశాల‌పై స్ప‌ష్టంగా వ్యూహాల్ని చెప్పిన మీద‌ట.. ఎంపీలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.
Tags:    

Similar News