ఆసియన్లు అంటే అమెరికన్లకు ఇప్పుడెంత మంట అంటే?

Update: 2021-03-21 09:30 GMT
ఇటీవల ఒక బ్యూటీపార్లర్ పై దాడి చేయటమే కాదు.. ఏకంగా ఎనిమిది మందిని హతమార్చటం తెలిసిందే. ఈ పైశాచిక వైనం షాకింగ్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో ఆందోళనకు గురి చేసే మరో అంశం ఏమంటే.. ఇటీవల కాలంలో ఆసియా దేశాలకు చెందిన వారెవరైనా సరే.. అమెరికన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిని మాటలతోనే కాదు.. చేతలలోనూ వేధిస్తూ.. బాధిస్తున్నారు.

ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా స్పష్టం చేస్తున్నారు. తాజాగా కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రమే కాదు.. దేశ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హ్యారిస్ లు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాడులపై మౌనం వీడాలని.. ప్రశ్నించాలన్నారు.

జాతి వివక్ష దాడులైనా.. విదేశీయులంటే భయంతో కూడిన దాడులైనా ప్రజలంతా మాట్లాడాలని.. ప్రతిస్పందించాలని పిలుపునిచ్చారు. మౌనంగా ఉండటం అత్యంత సంక్లిష్టమైూనదని.. మనం అలా ఉండకూడదన్న ఆయన.. తమ దేశంలోని ఆసియా అమెరికన్లకు అండగా ఉంటామన్నారు. ఆసియా అమెరికన్లలో నెలకొన్న భయభ్రాంతుల్ని చూస్తుంటే గుండె కరిగి నీరైపోతుందన్న ఆయన.. కరోనా సంక్షోభం వచ్చాక.. ఆసియన్లపై ఒక విధమైన కసితో అమెరికా వ్యాప్తంగా దాడులు పెరిగిపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆసియన్లపై దాడి చేస్తున్నారని.. నిందిస్తున్నారని.. వేధింపులకు దిగుతున్నారన్నారు. ‘వారిని బలిపశువుల్ని చేస్తున్నారు. మాటలతో తూట్లు పొడుస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. కొందరైతే ఏకంగా చంపేస్తున్నారు. త్వరలోనే కోవిడ్ 19 హేట్ క్రైమ్స్ యాక్ట్ ను తీసుకురానున్నాం. ఇది చట్టబద్ధం అయ్యాక.. విద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మరింత చురుగ్గా పని చేసే వీలు ఉంది’ అని ఆశాభావాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News