మోహ‌న్ బాబు మౌనం దేనికి సంకేతం?

Update: 2022-09-27 05:28 GMT
దివంగ‌త ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌కు వేలు విడిచిన త‌మ్ముడు మోహ‌న్ బాబు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ప‌లుమార్లు చెప్పుకున్నారు కూడా. అన్న అన్న అంటూ ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు ప‌ద‌వీచ్యుతిడిని చేసేవ‌ర‌కు ఎన్టీఆర్ ప‌క్క‌నే మోహ‌న్ బాబు కూడా ఉన్నారు. అంత‌కుముందు ఎన్టీఆర్‌తోనే మేజ‌ర్ చంద్ర‌కాంత్ అనే సూప‌ర్ హిట్ సినిమాను కూడా మోహ‌న్‌బాబు నిర్మించారు.

1995లో టీడీపీని, ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చంద్ర‌బాబు హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డంతో మోహ‌న్ బాబు కూడా చంద్ర‌బాబు వైపు జంప‌య్యారు. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు కూడా ద‌క్కింది. ఈ విష‌యంలో అప్ప‌ట్లో ఎన్టీఆర్ కూడా మోహ‌న్ బాబు వ్య‌వ‌హార శైలిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ్ముడు త‌మ్ముడు అని చేర‌దీస్తే చంద్ర‌బాబుతో చేరాడ‌ని వాపోయారు.

అయితే సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఎన్టీఆర్‌పై మోహ‌న్ బాబు మాటల్లో అభిమానం చూపుతూనే ఉండేవారు. అన్న ఎన్టీఆర్ మ‌హానుభావుడ‌ని, కార‌ణ‌జ‌న్ముడ‌ని, దైవాంశ సంభూతుడ‌ని కొనియాడుతూనే ఉండేవారు. అలాంటి మోహ‌న్ బాబు నాటి సంక్షోభంలో చంద్ర‌బాబు పంచ‌న చేరాక.. త‌ర్వాత ఆయ‌న వ‌చ్చిన విభేదాల‌తో గ‌త ఎన్నిక‌ల ముందు వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున కూడా ప్ర‌చారం చేశారు. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా రాజ్య‌స‌భ లేదా టీటీడీ చైర్మ‌న్ లేదా కేబినెట్ హోదాతో ఏదైనా కార్పొరేష‌న్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించారు. అయితే ఏ ప‌ద‌విని జ‌గ‌న్ ఇవ్వ‌లేదు.

దీంతో అప్ప‌టి నుంచి మోహ‌న్ బాబు పొలిటిక‌ల్‌గా సైలెంట్ అయిపోయారు. మ‌ధ్య‌లో ఒక‌సారి బీజేపీని, ప్ర‌ధాని మోడీని ఆకాశానికెత్తారు. అయితే తాజాగా విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పేరు మార్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై ఎక్క‌డి ఎక్క‌డి వాళ్లో స్పందిస్తున్నా మోహ‌న్ బాబు మాత్రం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అందులోనూ మోహ‌న్ బాబు విద్యావేత్త‌గానూ ఉన్నారు. ఆయ‌న‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల తిరుప‌తిలో త‌న పేరుతో మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీ అని విశ్వవిద్యాల‌యాన్ని సైతం స్థాపించారు. ఎన్టీఆర్‌తో అనుబంధం రీత్యా చూసినా, వైఎస్ జ‌గ‌న్‌తో అనుబంధం రీత్యా చూసినా, ఒక విద్యావేత్త‌గా చూసినా యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై మోహ‌న్ బాబు స్పందించాల్సి ఉంది. అయితే ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా ఆయ‌న స్పందించ‌లేదు.

వైఎస్ జ‌గ‌న్ పార్టీలో చేరినా త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌నే భావ‌న‌లో మోహ‌న్ బాబు ఉన్నార‌నే వార్త‌లు ఇటీవ‌ల వ‌చ్చాయి. త‌న‌కు ఏ ప‌దవీ ఇవ్వ‌క‌పోవ‌డం, త‌న క‌ళాశాల‌కు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ వ్య‌వ‌హారంలో ఇంకా న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డం, సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్పుడు త‌న‌ను పెద్ద‌గా గుర్తించ‌కుండా చిరంజీవిని జ‌గ‌న్ పిల‌వ‌డం వంటి చ‌ర్య‌లు మోహ‌న్ బాబుకు ఆగ్ర‌హాన్ని క‌లిగించాయ‌ని టాక్‌.

మ‌రి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై మోహ‌న్ బాబు ఫైర్ అవుతార‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ను విమ‌ర్శిస్తార‌ని ఆశించారు. అయితే విచిత్రంగా ఎందుకో ఆయ‌న త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు సైలెంట్‌గానే ఉండిపోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News