టికెట్ ఇవ్వ‌లేద‌ని అర్థ‌రాత్రి బాబుతో భేటీ!

Update: 2019-01-30 05:17 GMT
రాజ‌కీయాల్లో అన్ని అనుకున్న‌ట్లే జ‌ర‌గ‌వు. అర్హ‌త ఉన్నా.. అవ‌కాశం ఉన్నా.. అదృష్టం కూడా ఉండాలి. అప్పుడు మాత్ర‌మే ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ చిన్న విష‌యాన్ని మిస్ అయిన కొంద‌రు నేత‌లు త‌మ ఎదుగుద‌ల‌కు తామే చెక్ పెట్టుకుంటూ ఉంటారు. రాజ‌కీయాల్లో కొన్ని సంద‌ర్భాల్లో ఎదురుదెబ్బ‌లు మామూలే. ఎంత క‌ష్ట‌ప‌డినా క‌లిసి రావ‌టం ఉండ‌దు. అంత మాత్రాన న‌మ్ముకున్న పార్టీని విడిచి పెట్ట‌కూడ‌దు.

పార్టీకి ఎంత విధేయుత‌గా ఉంటే.. అంత‌గా అవకాశాలు వెతుక్కుంటూ వ‌స్తాయి. కాకుంటే కాస్త ఆల‌స్య‌మ‌వుతుందంతే. ఈ మ‌ర్మాన్ని గుర్తించ‌ని నేత‌లు ప‌లువురు ఆగ‌మాగం అవుతుంటారు.తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి బావ‌మ‌రిది.. రాయ‌చోటి మాజీ ఎమ్మెల్యే గ‌డికోట ద్వార‌క‌నాథ‌రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును అర్థ‌రాత్రి వేళ‌లో భేటీ అయ్యారు.

మొద‌ట్నించి నిల‌క‌డ త‌క్కువ‌గా పేరున్న ద్వార‌కానాథ‌రెడ్డి 1994లో ల‌క్కిరెడ్డి ప‌ల్లె నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఆ స‌మ‌యంలో గెలిచిన ఆయ‌న‌.. 2004లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ వెంట వ‌స్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండుసార్లు రాయ‌చోటి టికెట్ కోసం ఆశించినా ఆయ‌న‌కు ఫ‌లితం ద‌క్క‌లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డికి టికెట్ ల‌భించింది. దీంతో.. అప్ప‌ట్లో ఆయ‌న పార్టీ మారాల‌నుకున్నారు. కానీ మార‌లేదు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయ‌న‌కు.. ఈసారి ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌టం సాధ్యం  కాద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో టీడీపీలో చేరేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు.

తాజాగా చంద్ర‌బాబును క‌లిసిన ఆయ‌న త‌న‌కు రాయ‌చోటి టికెట్ ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఎలాంటి హామీ ఇవ్వ‌ని బాబు.. ముందు పార్టీలో చేరాల‌ని.. త‌ర్వాత టికెట్ గురించి ఆలోచిద్దామ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేర్చుకొని  త‌ర్వాత ఏదోలా టికెట్ ఇవ్వ‌కుండా చేయ‌టం బాబుకు బాగా అల‌వాట‌ని.. తాజా ఎపిసోడ్‌ లో ద్వార‌నాథ‌రెడ్డి రెండింటికి చెడ్డ రేవ‌డి అయిన‌ట్లుగా చెబుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లో చేరి ఉంటే.. ఈసారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత ఏదో ఒక అవ‌కాశం ల‌భించేద‌ని.. అర్థ‌రాత్రి బాబుతో భేటీ పుణ్య‌మా అని మంచి అవ‌కాశం మిస్ చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. చేతులారా అవ‌కాశాన్ని చెడ‌గొట్టుకోవ‌టం అంటే ఇదేనేమో?


Tags:    

Similar News