వందేళ్ళ క్రితం విశాఖ మన్యంలో ఏం జరిగిందంటే...?

Update: 2022-08-22 09:32 GMT
ఇప్పటికి వందేళ్ళు అంటే తెల్లవారి పాలనలో దేశమంతా మగ్గుతున్న కాలమది. నోరెత్తితే గొంతు మీద తూటా పెట్టి కాల్చేసే కర్కశ పాలన నడుస్తున్న రోజులవి. చదువుకున్న వారు పట్నవాసులే వలస పాలనతో నలిగిపోయిన దైన్యమది.ఇక మన్యంలో అమాయక గిరిజనులు మూగ జీవుల కంటే దారుణంగా నరకాన్ని చవి చూడాల్సి వచ్చింది. సరిగ్గా ఆ టైమ్ లో వారికి దేవుడిగా అల్లూరి సీతారామరాజు కనిపించారు.

అల్లూరి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. అయితే ఆయన తండ్రి మరణంతో అమ్మమ వూరు అయిన విశాఖ జిల్లా పాండ్రంగికి వచ్చారు. విశాఖ ఏవీఎన్ కళాశాలలో హై స్కూల్ దాకా చదివినా ఆయనకు ఎందుకో చదువు ఒంటబట్టలేదు.ఆయన ఎపుడూ పరధ్యానంగా ఉండేవారు. ఆయనలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయింది. ముక్కు మూసుకుని ఏజెన్సీ కొండల్ల్లో రోజుల తరబడి గడిపేవారు.

భోజనం నీరు లేకుండా అల్లూరి అలా యోగ  నిద్రలో ఉండేవారు. ఆయన్ని చూస్తూ వచ్చిన గిరిజనులు సామి వచ్చారు అనుకుని ఆయన చుట్టూ పోగెయ్యేవారు. వారి సందడికి కళ్ళు తెరచిన అల్లూరి ముందు వారు తమ బాధలను చెప్పుకునేవారు. ఆ రోజుల్లో మందులు లేవు, జబ్బు చేస్తే వైద్యం లేదు. అయితే అప్పటికే తమ ఇంట ఎంతో కొంత వంటబట్టించుకున్న ఆయుర్వేద వైద్యంతో మూలికలు అవి తీసి అల్లూరి వారికి వైద్యం చేసేవారు. వారి మన్నన అందుకున్నారు. వారి ప్రేమను నిండుగా పొందారు. వారి బాధలు విన్నారు.

తన చదువుతో, వివేకంతో వారికి మంచి సలహాలు ఇస్తూ ముందుకు సాగేలా ప్రోత్సహించారు. ఆ సమయంలో బ్రిటిష్ వారు, వారి కాంట్రాక్టర్లు చేస్తున్న మోసాలు, అమాయక గిరిజనం చేత బండెడు చాకిరి చేయించుకుని వారికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా అన్యాయాన్ని  చేస్తున్న వైనాన్ని గమనించి ఇదేమిటి అన్యాయమని అల్లూరి నిలదీశారు. నేరుగా తెల్లదొరల మీదనే ఆయన తన దాడిని మొదలెట్టారు. ఆ విధంగా గిరిజనం మేలు కోసం అల్లూరి ఆరంభించిన పోరాటం కాస్తా చివరికి దేశ స్వాతంత్ర పోరాటంగా మారింది.

అల్లూరి రెండేళ్ల పాటు మన్యంలో ఉంటూ సాగించిన పోరాటం చరిత్ర పుటలలో పదిలంగా నిలిచిపోయింది. ఇందులో తొలి పోరాట ఘట్టం 1922 ఆగస్ట్ 22న మొదలైంది. ఆ రోజు అల్లూరి చెప్పి మరీ చింతపల్లి పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. నేను ఫలానా టైమ్ కి వస్తున్నా కాచుకోండి అంటూ అల్లూరి లేఖ రాసి మరీ పోలీస్ స్టేషన్ లో వదిలి ఆ టైమ్ కి మెరుపు దాడి చేసి మరీ స్టేషన్ లో ఆయుధాలను తీసుకెళ్ళేవారు. పైగా అల్లూరి తాను ఏ ఏ ఆయుధాలు తీసుకున్నాను అన్నది ఒక రిజిష్ట‌ర్ లో పూర్తి వివరాలు రాసి మరీ తన సంతకం కూడా పెట్టి వెళ్ళేవారు. అదీ అల్లూరి దర్జా, ధైర్యం.

ఇలా అల్లూరి తొలి పోరాటంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఏకంగా 11 తుపాకులు, 1,390 తూటాలు, అయిదు కత్తులు, 14 బాయ్ నెట్లను తమతో పాటుగా తీసుకుపోయింది. ఇది ఒక విధంగా తెల్ల దొరలను గడగడలాడించిన పోరుగా చెప్పాలి. అల్లూరి అది లగాయితూ రెండేళ్ళ పాటు ముప్పతిప్పలు పెట్టి బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయారు. ఆయన 1924లో మరణించేవరకూ తెల్లవారికి సింహ స్వప్నంగానే ఉన్నారు.

అల్లూరి తొలి పోరాటానికి వందేళ్ళు అయిన సందర్భంగా చింతపల్లిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చింతపల్లిలో అల్లూరి మ్యూజియం ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన జీవిత విశేషాలను కూడా భావి తరాలకు తెలియచేసేలా ప్రయత్నం జరుగుతోంది.
Tags:    

Similar News