మాజీ మంత్రి అనిల్‌కేమైంది.. ఎందుకిలా?

Update: 2022-07-30 06:47 GMT
వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉన్న జిల్లా క‌డ‌ప త‌ర్వాత ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లానే. అయితే నేత‌ల మ‌ధ్య విబేధాలు ఆ పార్టీ అధిష్టానానికి త‌ల‌నొప్పి పుట్టిస్తున్నాయ‌ని అంటున్నారు. గతంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌స్తుతం మంత్రి, నాటి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి త‌దిత‌రులు అనిల్ కు స‌హ‌క‌రించ‌లేద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అనిల్ ప‌ద‌విని పోగొట్టుకున్నాక మంత్రి ప‌ద‌వి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డికి ద‌క్కింది. దీంతో అనిల్ ఆయ‌న‌పై అప్ప‌ట్లో న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. కాకాణి త‌న‌పై చూపిన ప్రేమ‌, వాత్స్య‌ల్యానికి రెండింత‌లు ప్రేమ తాను ఆయ‌న‌పై కూడా చూపుతాన‌ని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో వైఎస్ జ‌గ‌న్ వారిద్ద‌రినీ తాడేప‌ల్లికి పిలిపించుకుని స‌ర్దుబాటు చేయాల్సి వ‌చ్చింది.

ఈ వ్య‌వ‌హారం సద్దుమ‌ణిగిందిలే అనుకుంటుంటే మ‌ళ్లీ అనిల్ ఈసారి త‌న బాబాయ్ తోనే స‌మ‌రానికి దిగార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ను గ‌తంలో వైఎస్సార్సీపీ ద‌క్కించుకుంది. డిప్యూటీ మేయ‌ర్ గా అనిల్ కుమార్ యాద‌వ్ బాబాయ్ పోలుబోయిన‌ రూప్ కుమార్ యాద‌వ్ ఉన్నారు. వీరిద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌టం లేద‌ని చెబుతున్నారు. కార్పొరేష‌న్ కౌన్సిల్ లో జ‌రిగిన గొడ‌వే ఇందుకు కార‌ణ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కౌన్సిల్ సమావేశంలో అనిల్ కుమార్ యాద‌వ్ అనుచరుడైన కార్పొరేట‌ర్ కర్తం ప్రతాప్ రెడ్డి.. డిప్యూటీ కమిషనర్ చెన్నుడిపై పలు ఆరోపణలు చేయ‌డం గొడ‌వ‌కు కార‌ణ‌మ‌ని అంటున్నారు. అనిల్ అనుచ‌రుడు, కార్పొరేట‌ర్ ప్ర‌తాప్ రెడ్డి.. డిప్యూటీ క‌మిష‌న‌ర్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాద‌వ్ కలగజేసుకున్నారు. అధికారుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని ప్ర‌తాప్ రెడ్డికి చెప్ప‌బోయారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరిపై ఒక‌రు దూసుకెళ్లార‌ని చెబుతున్నారు. అక్క‌డున్న‌వారు గొడ‌వ పెద్ద‌ది కాకుండా అడ్డుకున్నార‌ని అంటున్నారు.

అయితే డిప్యూటీ మేయ‌ర్ రూప్ కుమార్ యాద‌వ్ పై దూసుకెళ్లింది.. అనిల్ కుమార్ అనుచ‌రుడే కావ‌డంతో బాబాయ్ - అబ్బాయ్ మ‌ధ్య సంబంధాలు స‌రిగా లేవ‌ని అంటున్నారు. అనిల్ కు తెలియ‌కుండా అనిల్ బాబాయ్ పైకి కార్పొరేట‌ర్ ప్ర‌తాప్ రెడ్డి వెళ్ల‌డ‌ని చెబుతున్నారు. బాబాయ్ రూప్ కుమార్ యాదవ్, అబ్బాయ్ అనిల్ కుమార్ యాద‌వ్ మ‌ధ్య విభేదాల‌తోనే ఈ గొడవ సాగింద‌ని అంటున్నారు.

నెల్లూరు కార్పొరేష‌న్ లో మొత్తం 54కి 54 డివిజ‌న్ల‌ను వైఎస్సార్సీపీనే గెలుచుకుంది. ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌సీటు కూడా రాలేదు. దీంతో అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని.. ప్ర‌జ‌లు భావించారు. అయితే నేత‌లు మాత్రం త‌మ మ‌ధ్య విభేదాల‌తో న‌గ‌రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News