పీసీసీ అధ్యక్షులు రాజీనామాలు చేస్తే ఏమవుతుంది?

Update: 2022-03-16 04:43 GMT
ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను వెంటనే రాజీనామా చేయమని సోనియాగాంధీ కోరటం విచిత్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అందుకనే పార్టీ ప్రక్షాళనలో భాగంగా వెంటనే రాజీనామాలు చేయాలని సోనియా ఐదు రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఆదేశించారు. వీరి రాజీనామాలతోనే పార్టీ ప్రక్షాళన మొదలవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

 ఇక్కడ గమనించాల్సిందేమంటే పీసీసీ అధ్యక్షుల రాజీనామాలు చేసినంత మాత్రాన పార్టీ ప్రక్షాళన అయిపోదు. ఎందుకంటే పేరుకే పీసీసీ అధ్యక్షులు కానీ మళ్ళీ వీళ్ళని ఆడించే తెరవెనుక శక్తులు ఢిల్లీలోనే ఉన్నాయి. ఢిల్లీ శక్తులు ఆడమన్నట్లు ఆడటమే పీసీసీ అధ్యక్షుల పనిగా మారిపోయింది. ఏ నిర్ణయమూ స్వతంత్రంగా తీసుకునే స్వేచ్చ పీసీసీ అధ్యక్షులకు లేదని అందరికీ తెలిసిందే. పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా నవ్ జోత్ సింగ్ సిద్ధూని అధిష్టానమే ఏరికోరి నియమించింది.

 సిద్ధు ఎంతటి అరాచకవాదో పార్టీలో అందరికీ తెలుసు. అయినా నియమించారంటే అందుకు బాధ్యత ఎవరు తీసుకోవాలి. ముఖ్యమత్రులతో గొడవలు పెట్టుకుని తాను ముణగటమే కాకుండా వాళ్ళనీ ముంచి చివరకు పార్టీ మొత్తాన్ని ముంచేశాడు.

సిద్ధూని నియమించినందుకు పార్టీ నాయకత్వమే బాధ్యత వహించాలి. అలాగే తప్పులన్నీ సోనియాగాంధి, రాహుల్, ప్రియాంకలో పెట్టుకుని పీసీసీ అధ్యక్షులను రాజీనామాలు చేయమనడం విచిత్రంగా ఉంది. రాహుల్ ఏ ఎన్నికైనా సీరియస్ గా తీసుకున్నారా?

దశాబ్దాలుగా గాంధీ కుటుంబాలను మాత్రమే గెలిపిస్తున్న అమేథీ, రాయబరేలీలో కూడా కాంగ్రెస్ ఓడిపోయిందంటే అందుకు కారణం తల్లీ, పిల్లలే. నియోజకవర్గాల్లో జనాలను చులకనగా చూడటం, పట్టించుకోకపోవటం, నిర్లక్ష్యం వల్లే చివరకు అక్కడ ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి.

ముందు సోనియా, రాహుల్, ప్రియాంకలు మారాలి. బలమైన నాయకత్వాల చేతిలో రాష్ట్ర పార్టీ పగ్గాలను పెట్టాలి. యువతకు, కొత్త నాయకత్వానికి అవకాశమివ్వాలి. అప్పుడే కాంగ్రెస్ పునర్వైభవం సాధ్యమవుతుంది. లేకపోతే పార్టీకి మంగళం పాడేయాల్సిందే. వీళ్ళు పాడకపోతే జనాలే మంగళం పాడేయటం ఖాయం.
Tags:    

Similar News