దేశంలో తొలిసారి.. ఆ 15 నిమిషాలు అలా జరిగిందట

Update: 2021-10-20 06:30 GMT
ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం మీద అల్లరిమూకలు ఖరీదైన కార్లలో పెద్ద ఎత్తున రావటం.. పార్టీ గేటును కారుతో గుద్దటం.. ఆ తర్వాత.. భారీ గేటును పడదోసి లోపలకు దూసుకెళ్లటం.. ఆ తర్వాత విధ్వంసకాండ స్వైర విహారం చేయటం లాంటివి దారుణ ఘటనలు దేశంలోనే తొలిసారిగా జరిగినట్లుగా అభివర్ణిస్తున్నారు. కత్తులు దూసుకున్నట్లుగా ఉండే పశ్చిమ బెంగాల్ లోనూ.. రాజకీయ శత్రుత్వం పీక్స్ లో ఉండే తమిళనాడులోనూ.. ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పే బిహార్ లోనూ జరగని రీతిలో.. మంగళగిరిలో డీజీపీ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడికి ఇప్పుడు షాకింగ్ గా మారింది. దాదాపు పదిహేను నిమిషాల పాటు సాగిన ఈ విధ్వంస కాండకు సాక్ష్యంగా సీసీ కెమేరా ఫుటేజల్ లు..  మీడియా ప్రతినిధులు తీసిన వీడియోలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన ఆరాచక కాండ దాదాపు పదిహేను నిమిషాల పాటు సాగినట్లుగా చెబుతున్నారు.

ప్రత్యక్ష సాక్ష్యులు..కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం.. ఆ పదిహేను నిమిషాల్లో ఏం జరిగిందన్నది చూస్తే..

-  మంగళవారం సాయంత్రం ఐదు గంటల వేళలో సుమారు 10 నుంచి 15 వాహనాల్లో (కొన్ని వీడియోల్లో మాత్రం ఆరేడు వాహనాలు కనిపించాయి).. డీజీపీ ఆఫీసు ముందు నుంచే సర్వీసు రోడ్డులో రాంగ్ రూట్ లోకి వేగంగా దూసుకొచ్చాయి. దీనికి ముందు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న సీకే కన్వెన్షన్ సెంటర్ వద్ద కాసేపు ఆగటం.. అందులోని కొందరు మద్యం సేవించటం లాంటివి చేసినట్లుగా చెబుతున్నారు.

-  ఏపీ 07 బీఈ 2345 నంబరు నల్లరంగు ఫార్చ్యూనర్‌ వాహనానికి అటూ ఇటూ వేలాడారు. వారి చేతుల్లో కర్రలు! దాని వెనుకే మరిన్ని వాహనాలు! వాహనాలన్నీ ఒక్కసారిగా దూసుకొచ్చాయి.   కార్యాలయం గేటును వాహనంతో గుద్దారు. అనంతరం పలువురు భారీ గేటును గట్టిగా ఊపేసి.. బలంగా తోసేశారు. దీంతో.. అది కాస్తా కిందకు పడిపోయింది. అనంతరం టీడీపీ ప్రధాన కార్యాయం ముందు అందరూ దిగారు. దాదాపు 120 మంది ఉంటే అందులో 40 మందివరకు మహిళలు ఉండటం గమనార్హం.

-  టీడీపీ ఆఫీసులోకి వెళుతూనే రాళ్లు రువ్వారు. కర్రలు.. రాళ్లు.. రాడ్లు.. సత్తులతో ఆఫీసు అద్దాల్ని బద్ధలు కొడుతూ విధ్వంసం సృష్టించారు. కుర్చీలను విసిరి కొట్టారు. కంటికి కనిపించిన ఫర్నీచర్‌నంతా ధ్వంసం చేస్తూ... కార్యాలయం రెండో అంతస్తు వైపు వెళ్లారు. ఆ సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ నేత పట్టాభి ఉన్నారు. ఆయనతో పాటు వర్ల రామయ్య కూడా ఉన్నారు. మరికొందరు నేతలు కూడా ఉన్నారు.

- పార్టీ రెండో అంతస్తులోకి వెళ్లేందుకు అల్లరిమూకలు పెద్ద ఎత్తున ప్రయత్నించినా.. అక్కడి తలుపులు ఎంతకూ తెరుచుకోలేదు. దీంతో.. వెనక్కి వచ్చి రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యాలయ సిబ్బంది బద్రి.. అనిల్.. విశాఖ డిప్యూటీ మేయర్ దొరబాబు.. గుంటూరు టీడీపీ పార్లమెంటు వ్యవహారాల ఇన్ ఛార్జి విద్యాసాగర్ తదితరులు దాడికి పాల్పడుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిపై దాడి చేయగా.. బద్రి తీవ్రంగా గాయపడ్డారు.

- దాదాపు పది నిమిషాల విధ్వంస కాండ జరిగిన తర్వాత పోలీసులు వచ్చారు. అది కూడా పరిమిత సంఖ్యలో. వారు వచ్చిన తర్వాత కూడా అల్లరిమూకులు రాళ్లు రువ్వుతూ వెళ్లటం గమనార్హం. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇద్దరు.. ముగ్గురు కానిస్టేబుళ్లు వారిని నిలువరించే ప్రయత్నం చేయటం.. అక్కడి ఆవేశపూరిత వాతావరణాన్ని చూసి వెనక్కి తగ్గారు. ఇలా దాదాపు పదిహేను నిమిషాల పాటు  ఇష్టారాజ్యంగా పరిణామాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News