లీగల్ నోటీసులతో అయ్యే పనేనా? కేటీఆర్ ఎందుకిలా చేస్తున్నారు?

Update: 2022-05-14 09:32 GMT
ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవటం.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుకోవటం.. అడ్డదిడ్డంగా ఆరోపణలు చేయటం లాంటివి ఈ మధ్య రాజకీయాల్లో రోటీన్ అయిపోతున్నాయి. కనీస మర్యాదల్ని ఇచ్చుకోకుండా పొలిటికల్ మైలేజీ మాత్రమే ముఖ్యమనుకునే ఈ రోజుల్లో.. ఒక ముఖ్య నేత చేసిన ఆరోపణలపై అధికారపార్టీకి చెందిన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయటం.. లీగల్ నోటీసుల్ని జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా చేసుకొని మంత్రి కేటీఆర్ కారణంగా 27 మంది విద్యార్థులు మరణించినా స్పందించలేదంటూ ఆరోపించారు. దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేనిపక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే.. కేటీఆర్ కు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పమని తేల్చేశారు బండి సంజయ్.

ఇలంటి వేళ.. ఆయనకు లీగల్ నోటీసులు పంపారు మంత్రి కేటీఆర్. కనీస ప్రమాణాల్ని పాటించకుండా అసత్య ఆరోపనలుచేయటం సరికాదన్న కేటీఆర్ న్యాయవాది.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు తన క్లయింట్ కేటీఆర్ కు అపాదించే ప్రయత్నం సరికాదంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.

మంత్రవర్యుల పరువుకు భంగం వాటిల్లేలా చేస్తున్న ఈ ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే సివిల్.. క్రిమినల్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి స్పందించిన బండి సంజయ్ తాను ఎలాంటి క్షమాపణలు చెప్పేదే లేదని స్పష్టం చేశారు.

ఆ మాటకు వస్తే.. కేటీఆర్ లీగల్ నోటీసుల్ని బండి సంజయ్ ఖాతరు చేయని రీతిలో రియాక్టు అయ్యారు. కేటీఆర్ కు దమ్ముంటే.. ఇంటర్ విద్యార్థుల మరణాలపై సీబీఐ దర్యాప్తును కోరాలని.. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థతో తనకు సంబంధం లేదని నిరూపించుకోవాలన్నారు.

"మీ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. పేద బిడ్డలు చనిపోతే నీ తండ్రి కనీసం స్పందించలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల గోడు వినేందుకు వెళితే పోలీసులతో లాఠీ ఛార్జి చేయించిన కుటుంబం మీది" అంటూ ఫైర్ అయ్యారు. ఇదంతా చూస్తే బండి చేసిన విద్యార్థుల మరణాల విషయంలో ఏదో రాజకీయంగా కాకుండా.. కొన్ని అంశాల్ని చూపించి మరీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం లీగల్ నోటీసు నుంచి అడుగు ముందుకుపడే అవకాశం తక్కువన్న మాట చెబుతున్నారు. ఒకవేళ.. కోర్టును ఆశ్రయించినా.. ఫలితం వచ్చేటప్పటికి చాలా కాలమే పడుతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News