దూరం దూరం : టీయారెస్ తో వైసీపీ అంతే...?

Update: 2022-07-18 23:30 GMT
మిత్రులుగా ఉన్న వారి మధ్య దూరం పెరుగుతోంది. ఇద్దరికీ భావ సారూప్యం కొన్ని విషయాల్లో ఉంది. ప్రత్యేకింది. రాజకీయంగా ఇద్దరికీ తెలుగుదేశం పార్టీ బద్ధ శతృవు, అదే టైమ్  లో చంద్రబాబు అన్నా కూడా కేసీయార్, జగన్ ఇద్దరూ ఎప్పటికీ ప్రత్యర్ధిగానే చూస్తారు. అలా బాబు వైరమే ఇద్దరినీ దగ్గర చేసింది. ఇద్దరూ చెరో రాష్ట్రానికి అధినేతలుగా కొనసాగుతున్నారు.

చిత్రమేంటి అంటే ఏపీలో వైసీపీ విపక్షంలో ఉన్నపుడే టీయారెస్ తో మంచి దోస్తీ నెరిపింది. అండగా దండగా టీయారెస్ ఉండేది. ఇక టీయారెస్ కి రాజకీయంగా వైసీపీ తన తోడ్పాటు అందించేదని చెబుతారు. వైసీపీకి తెలంగాణాలో ఉన్న బలాన్ని సామాజికవర్గాన్ని టీయారెస్ వైపుగా తిప్పి ఎంతో మేలు చేసింది అని చెబుతారు.

అలా ఇద్దరికీ పరస్పర ప్రయోజనకరంగా సాగిన ఈ స్నేహం జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కూడా సవ్య దిశగానే సాగింది. కానీ మధ్యలో కమలం దూరడంతో దూరం పెరిగింది అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు బలమైన పార్టీలూ ఒక్క మాట మీద నిలబడితే కష్టమని భావించిన బీజేపీ పావులు కదిపింది. ఫలితంగా ఇద్దరు మిత్రుల మధ్యన ఎడబాటు వచ్చింది.

ఇక కేంద్రం కూడా రెందు రాష్ట్రాల మధ్య విభజన అంశాలను తేల్చకుండా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతూ ఎగదోసే విధానానికి పాల్పడింది అని చెబుతారు. ఏది ఏమైనా ఇపుడు జగన్ కేసీయార్ ల మధ్య బద్ధ వైరం లేకపోయినా అవసరానికి సరిపడా స్నేహం అయితే లేదు. ఇద్దరూ కొన్ని విషయాల్లో భిన్న ధృవాల మాదిరిగా ఉంటున్నారు. దానికి అచ్చమైన ఉదాహరణ రాష్ట్రపతి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో విపక్షాల తరఫున నిలబడిన యశ్వంత్ సిన్ హాకు టీయరెస్ మద్దతు ఇస్తే బీజేపీ అభ్యర్ధి ద్రౌపది ముర్మునకు వైసీపీ మద్దతు ఇస్తోంది.

ఇక కేంద్రం మీద టీయారెస్ కత్తికట్టి యుద్ధం చేస్తోంది. పార్లమెంట్ లో మిగిలిన పార్టీల ఎంపీలను కలుపుకుని పోయి  ఉభయ సభలలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని టీయారెస్ వ్యూహ రచన చేస్తోంది. అయితే తోటి తెలుగు రాష్ట్రంగా ఉన్న ఏపీ ఈ విషయంలో టీయారెస్ కి సహకరించే అవకాశాలు లేవు అంటున్నారు. ఏపీ కేంద్రానికి మద్దతుగా నిలవడం ద్వారా నిధులను తెచ్చుకుంటోంది. ప్రస్తుతానికి ఈ వ్యూహం కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారు.

దాంతో కేసీయార్ దూకుడుగా కేంద్రాన్ని ఎదిరించినా వైసీపీ దూరంగానే ఉండాల్సి వస్తోంది అని చెబుతున్నారు. దాంతో ఈ ఇద్దరు రాజకీయ బంధం అర్ధం కాక చాలా మంది బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. కేసీయార్ కానీ కేటీయార్ కానీ ఆ మధ్యన జగన్ మీద వైసీపీ మీద సన్నసన్నగా కొన్ని కామెంట్స్ చేసినా జగన్ నుంచి నేరుగా ఇంతవరకూ ఒక్క వ్యతిరేక మాట రాలేదు. అంటే తమ స్నేహం కొంతవరకే కొన్ని అంశాలకు పరిమితం అయి మాత్రమే అని వైసీపీ చెప్పకనే చెబుతోంది.

జాతీయ రాజకీయాల్లో టీయారెస్ కి తోడుగా వైసీపీ నిలవదు అని చెబుతున్నారు అన్న మాట. ఇక టీడీపీ అయితే అసలే టీయారెస్ కి సపోర్ట్ గా నిలిచే సీన్ లేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో టీయారెస్ కి మద్దతు కరవైన వేళ జాతీయంగా మిగిలిన పార్టీలు ఎంతమేరకు సహకరిస్తాయి అన్నది చూడాలి. ఏది ఏమైనా కేసీయార్ జగన్ ల మధ్య చూస్తే స్నేహం ఇలాగే దూరంగా మారి వైరం అవుతుందా లేక అది ఇలాగే ఒక మాదిరిగానే సాగుతుందా అన్నది కాలం చెప్పాల్సిన జవాబు.
Tags:    

Similar News