బీజేపీలో ఏం జరుగుతోంది ?

Update: 2023-05-20 11:41 GMT
తెలంగాణా బీజేపీలో విచిత్రమైన పరిస్ధితులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలో చేరటానికి ఎవరూ ఆసక్తి చూపకపోగా ఉన్న నేతల్లో కొందరు బయటకు వచ్చేసేట్లున్నారు. దీనికి కారణం ఏమిటి ? మొదటిది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు. రెండోది కమలంపార్టీలో అంతర్గత వివాదాలు పెరిగిపోతుండటం. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ ను వదిలేసి వెళ్ళిన నేతలందరినీ తిరిగి పార్టీలోకి వచ్చేయాలని పిలుపిచ్చారు. బీజేపీలో చేరిన కొందరు నేతల పేర్లను కూడా రేవంత్ ప్రస్తావించి తిరిగి పార్టీలోకి వచ్చేయాలన్నారు.

రేవంత్ ప్రస్తావించిన పేర్లలో ఒకళ్ళైన కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతు బీజేపీలో పరిస్ధితులన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపాత్ర పోషించిన కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టుచేయకపోవటంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని జనాలు చెప్పుకుంటున్నట్లు ఆరోపించారు.

ప్రజల ఆలోచనల ప్రకారమే ఇతర పార్టీల్లోనుండి నేతలు బీజేపీలో చేరటంలేదన్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో చేరకపోవటానికి కూడా ఇదే కారణమన్నారు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ నుండి తాను బయటకు వచ్చేసినా సోనియాగాంధి, రాహుల్ గాంధి అంటే తనకు చాలా అభిమానమని చెప్పారు.

ఒకవైపు బీజేపీలో ఉంటు మరోవైపు సోనియా, రాహుల్ అంటే తనకు ఇప్పటికే అభిమానమే అని చెప్పటంలో అర్ధమేంటి ? ఇక బీజేపీలో చేరికల కమిటీకి ఛైర్మన్ ఈటల రాజేందర్ కు పార్టీ చీఫ్ బండ సంజయ్ కు ఏమాత్రం పడటంలేదట. వీళ్ళిద్దరి మధ్య విభేదాల కారణంగానే కొందరు పార్టీలో చేరుదామని అనుకుని కూడా వెనక్కు తగ్గినట్లు సమాచారం.

పార్టీలో ఎవరైనా చేరాలంటే టికెట్ హామీనే కోరుతారు. అయితే ఆ హామీని ఈటల ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ సదరు నేతకు ఈటెల టికెట్ హామీఇచ్చినా బండి ఎక్కడ గండి కొడతారో అనే భయం ఉందట. అందుకనే బీజేపీలో చేరే విషయమై వెనకాడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. దాంతో బీజేపీలో చేరే విషయమై నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది.

Similar News