మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? లాక్ డౌన్ తప్పదా?

Update: 2021-04-11 04:35 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అంతకంతకూ పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర లోనే కావటం గమనార్హం. ఎన్నిచర్యలు తీసుకున్నా కేసుల నమోదు తగ్గకపోవటం.. వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న వేళ.. తాజాగా ఆన్ లైన్ లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు.. విపక్ష నేతలు హాజరయ్యారు.

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోందని.. లాక్ డౌన్ మినహా మరే ప్రత్యామ్నాయం లేదన్న మాట ముఖ్యమంత్రి నోట వచ్చింది. కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ తప్పనిసరిగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేసుల నమోదు తగ్గించేందుకు మినీ లాక్ డౌన్.. వీకెండ్ లాక్ డౌన్ లను అమలు చేస్తున్నారు.అయినా పెద్దగా ఫలితం రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంపూర్ణ లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదన్న మాట వినిపిస్తోంది. మహారాష్ట్రలో సరాసరిన ప్రతి రోజు 60వేల కేసులు నమోదువుతున్నాయి. ప్రస్తుతం ఐదు లక్షల మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ నెల 15 నుంచి పరిస్థితి మరింత దారుణంగా మారనుందని.. సెకండ్ వేవ్ లో యువత ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నట్లుగా సీఎం ఉద్దవ్ పేర్కొని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా గొలుసును తెంచేందుకు లాక్ డౌన్ ఒక్కటే అవకాశంగా ఉందన్నారు. కనీసం రెండు వారాల పాటైనా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని  స్పష్టం చేశారు.

అయితే.. ఈ ప్రతిపాదనపై మహారాష్ట్ర ప్రతిపక్ష నేత.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యతిరేకించారు. లాక్ డౌన్ విధిస్తే.. ప్రజల్లో అనవసరమైన కోపాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచనకు భిన్నమైన అంశాల్ని ప్రతిపక్షం చెప్పటంతో.. రానున్న రెండురోజుల్లో కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఉద్దవ్ సర్కారు స్పష్టం చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్రకు లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News