అట్లాంటి కేసీఆర్ ఎందుకిలా అయిపోయాడు?

Update: 2022-07-29 23:30 GMT
టీఆర్ఎస్ అంటేనే ఉప ఎన్నికల పార్టీగా ముద్రపడిపోయింది. నాడు ఉద్యమకాలంలో వైఎస్ రాజశేఖర్ ఉన్న రోజుల్లో ఊ.. అంటే చాలు కేసీఆర్ అండ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయడం.. ప్రజల్లోకి వెళ్లడం.. వారు గెలిపించడం.. ఉద్యమాన్ని సజీవంగా ఉంచడం జరిగిపోయేది. పలు మార్లు గెలవకున్నా.. టీఆర్ఎస్ దెబ్బతిన్నా కూడా కేసీఆర్ మాత్రం 'ఉప ఎన్నికలంటే ' తగ్గేదేలే అన్నట్టుగా ముందుకెళ్లారు.

తెలంగాణలో మొదటి సారి పాలనలోనూ కేసీఆర్ అంతే దూకుడుగా వ్యవహరించారు. నాడు జహీరాబాద్ ఉప ఎన్నిక సహా పలు చోట్ల చనిపోయిన ఎమ్మెల్యేల సీట్లను ఈజీగా గెలిచేశారు. కానీ సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఇప్పుడు టీఆర్ఎస్ అధినేతకు అస్సలు మనసు రావడం లేదట.. ఉప ఎన్నికలంటేనే ఆమడదూరం పరిగెత్తుతున్న పరిస్థితి. దీనంతటికి కారణం.. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలే. ఔను.. ఈ రెండింటిలో అతివిశ్వాసంతో వెళ్లిన కేసీఆర్ బొక్క బోర్లా పడ్డారు. అందులో గెలిచిన వారు పాత టీఆర్ఎస్ వారే కావడంతో కేసీఆర్ పుండుమీద కారం చల్లినట్టైంది. ఇప్పటికీ ఈ రెండు గాయాలను మరిచిపోలేక ఇప్పుడు ఉప ఎన్నికలు అంటేనే కేసీఆర్ కు చమటలు పడుతున్న పరిస్థితి.

ఇప్పుడు మరో ఉప ఎన్నిక రావడానికి సమయం ఆసన్నమైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకొని బీజేపీలో చేరడానికి రెడీ అయిపోయారు. రేపోమాపో చేరడం ఖాయమంటున్నారు. బీజేపీలో చేరాక ఎలాగూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే మునుగోడులో రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డి మళ్లీ గెలవడం కల్లా అంటున్నారు. ఎందుకంటే ఆయనకు జనాల్లో అంత పేరు, పరపతి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర లేదు. అందుకే కోమటిరెడ్డి రాజీనామా చేసిన మరుక్షణం అక్కడ ఉప ఎన్నిక వస్తే ఓడించడానికి నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారట.. బీజేపీకి అస్సలు బలం లేని ఈకాంగ్రెస్ సీటులో పోటీచేస్తే ఓడిపోవడం ఖాయమంటున్నారు.

ఇక మునుగోడు కాంగ్రెస్ సీటు. రాజగోపాల్ రెడ్డి తన సొంత ఆర్తిక బలం.. అన్నయ్య వెంకటరెడ్డిని చూసుకొని గెలిచారు.కానీ ఇప్పుడు బీజేపీలో చేరితే ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు లేవు. బీజేపీకి అసలు మునుగోడులో క్యాడరే లేదు. రాజగోపాల్ రెడ్డి కింద ఉన్న అనుచరగణం, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో బీజేపీ నుంచి మునుగోడులో పోటీచేస్తే కోమటిరెడ్డి ఓడిపోవడం పక్కా అంటున్నారు.

ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్ కు మరో నేత అవసరం. ఇక్కడ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దించుతామని చూస్తున్నా అది జరిగే పని కాదు. తమ్ముడిపై అన్న పోటీచేయడు. పోనీ మరో నేత కోసం వెతికినా దొరకని పరిస్థితి. తెలంగాణలో రోజరోజుకు కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టుగా తయారైన వేళ కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిపించే నేత ఇక్కడ లేరు.

సో మునుగోడు ఉప ఎన్నిక.. అటు టీఆర్ఎస్ నే కాదు.. ఇటు బీజేపీ, కాంగ్రెస్ లను కలవరపెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత.. అస్సలు బలం లేని బీజేపీ నిస్సహాయత.. కునారిల్లిన కాంగ్రెస్ వ్యథ వెరిసి ఈ మూడుపార్టీలకు మునుగోడు ముచ్చెమటలు పట్టిస్తోందట..
Tags:    

Similar News