మోడీకి ఇచ్చిన అయిదు పేజీల నోట్ లో ఏముంది....?

Update: 2022-11-12 04:59 GMT
ఏపీలో మోడీ టూర్ లో హాట్ టాపిక్ ఏంటి అంటే ఎనిమిదేళ్ల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం. పవన్ కళ్యాణ్ తో భేటీ ఏకంగా అరగంటకు పైగా సాగడం. ఇది నిజంగా రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది. ఏపీ రాజకీయాలన్నీ పవన్ కేంద్రంగా తిరుగుతున్నాయా అన్న చర్చకు కూడా ఆస్కారం ఇచ్చింది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మోడీతో భేటీ సందర్భంగా అయిదు పేజీలతో తయారు చేసిన ఒక నోట్ ని ఆయనకి అందించారని ప్రచారం అయితే సాగుతోంది. ఈ నోట్ లో గత మూడున్నరేళ్ళుగా ఏపీలో వైసీపీ సర్కార్ చేస్తున్న అక్రమాలు, అరాచకాలు, విపక్షాలను ఎలా వేధించుకుని తింటోంది అన్న విషయాలను కూలంకషంగా వివరించారని అంటున్నారు.

ఈ నోట్ మీద తగిన యాక్షన్ కేంద్రం తీసుకుంటుందని జనసేన వర్గాలు ఆశాభావంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష నేతల పర్యటనలకు అసలు అవకాశం ఇవ్వని తీరులో పోలీసులు సాగిస్తున్న దమనకాండను ఆ నోటులో పవన్ ప్రస్తావించారని అంటున్నారు. అలాగే గత నెల 15న పవన్ విశాఖ టూర్ చేసినపుడు ఆయన్ని ఒక హొటల్ కి మాత్రమే పరిమితం చేసి ప్రభుత్వం సాగించిన ఒక రాజకీయ క్రీడను కూడా దృష్టికి తెచ్చారని చెబుతున్నారు.

అదే విధంగా ఇప్పటం ఇష్యూ కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇక అవినీతి అక్రమాలకు గత మూడున్నరేళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న వైనాన్ని పవన్ ఆయనకు తెలియచేశారని అంటున్నారు. అదే విధంగా ఏపీలో అభివృద్ధి లేమి, అవినీతి, ఇష్టా రాజ్యంగా సాగుతున్న పాలన వంటివి ఆ నోట్ ద్వారా పవన్ మోడీకి చెప్పాల్సినవి అన్నీ చెప్పారని చెబుతున్నారు.

మరి ఈ నోట్ విషయంలో ప్రధాని ఏమి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇపుడు ఆసక్తిగా మారింది. ఏపీలో వైసీపీ సర్కార్ కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటోంది. అంతకంతకు ఎన్డీయే మిత్రులు తగ్గుతున్న్న వేళ రాజ్యసభలో బలం తగ్గిన కేంద్రానికి వైసీపీ ఆప్తమిత్రుడిగా ఉంది. దాంతో కేంద్రంలో బీజేపీకి అన్నీ తెలిసినా పెద్దగా ఏపీ వైపు దృష్టి సారించడంలేదని అంటున్నారు.

అయితే పవన్ని మిత్రుడుగా ఉంచుకుని ఏపీలో తమదైన రాజకీయ వాటాను సాధించాలని ఉబలాటపడుతున్న బీజేపీ పవన్ ఇచ్చిన అయిదు పేజీల నోట్ ని స్టడీ చేయకుండా వదిలేస్తుందా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. పవన్ కోరుకున్నట్లుగా  ఎంతో కొంత చేస్తేనే కదా ఆయన బీజేపీ వైపు మళ్లేది అన్నది కూడా మరో చర్చగా ఉంది.

ఏది ఏమైనా మూడున్నరేళ్ళ పాటు వైసీపీ బీజేపీల మధ్య సాగిన సాఫీ కధకు ఇక మీదట బ్రేకులు పడతాయా. అసలు మోడీ ఏమనుకుంటున్నారు. పవన్ని విశాఖకు పిలిపించుకుని మాట్లాడడం వెనక ఆయన ఆలోచనలు ఏంటి అన్నవి తెలియాలంటే కొంతకాలం పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News