రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు?

Update: 2021-07-12 16:30 GMT
హుజూరాబాద్ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ లో అల‌జ‌డి చెల‌రేగింది. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటూ.. టీఆర్ఎస్ అనుకూలంగా ప‌నిచేసిన‌ట్టు ఆడియో లీకేజీతో బ‌య‌ట‌ప‌డ‌డంతో.. కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. షోకాజ్ నోటీసు జారీ చేయ‌గా.. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు కౌశిక్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే కాంగ్రెస్ నుంచి కౌశిక్ ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. అనంత‌రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కోవ‌ర్టుగా మారార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ లోని ఇంటి దొంగ‌ల‌ను వ‌దిలి పెట్టేది లేద‌ని హెచ్చ‌రించిన రేవంత్‌.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు దొంగ‌ల‌కు గ‌డువు ఇస్తున్న‌ట్టు చెప్పారు. అలాంటి వారు ఎవ‌రైనా ఉంటే.. పార్టీలోంచి వెళ్లిపోవాల‌ని అన్నారు.

కాగా.. అంత‌కు ముందు రాజీనామా ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా కౌశిక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు త‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని అన్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి కాకుండా.. ఇత‌రుల‌కు ప‌ద‌వులు ఇస్తున్నార‌ని ఆరోపించారు. పార్టీ ప‌ద‌వుల విష‌యంలో త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని అన్నారు. కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు పార్టీకి న‌ష్టం క‌లిగిస్తున్నార‌ని అన్నారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష‌ ప‌ద‌వి ఇవ్వ‌డంపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మాణిగం ఠాగూర్ కు 50 కోట్ల రూపాయ‌లు ఇస్తేనే.. ఆ ప‌ద‌వి వ‌చ్చింద‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్య‌త‌లు ఇవ్వ‌డం త‌న‌ను బాధించింద‌ని అన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మేన‌ని అన్నారు.

అయితే.. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా.. రేవంత్ కు ఈ ప‌రిణామం ఇబ్బంది క‌రంగా మారొచ్చ‌ని అంటున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపికైన త‌ర్వాత ఇన్నాళ్లూ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్టుగా ఉన్న పోరు కాస్తా.. త్రిముఖ పోరుగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స‌త్తా చాటాల‌ని రేవంత్ భావించారు. దానికి కౌశిక్ రెడ్డినే ఉప‌యోగించుకోవాల‌ని చూశారు. కానీ.. కౌశిక్ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. ఈట‌ల‌ను వేరే అభ్య‌ర్థుల‌తో ఎదుర్కోలేమ‌ని భావించిన టీఆర్ఎస్‌.. ముందుగానే కౌశిక్ ను ట‌చ్ లోకి తెచ్చుకుంది. కాంగ్రెస్ లో ఉంటే ఏముంది అనుకున్నాడేమోగానీ.. కౌశిక్ సైతం కారెక్కేందుకు సిద్ధ‌మయ్యారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో ఉంటూనే ప‌నులు చ‌క్క‌దిద్దుకున్న కౌశిక్ రెడ్డి.. ఆడియో వ్య‌వ‌హారం లీకేజ్ కావ‌డంతో.. గుట్టుకాస్త ర‌ట్టైపోయింది. దీంతో.. ముసుగులోగుద్దులాట ఎందుకని గులాబీ గూటికి చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇప్పుడు రేవంత్ ఈ విష‌యాన్ని ఎలా డీల్ చేస్తాడ‌న్న‌దే కీల‌కంగా మారింది. ఇప్ప‌టికే.. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇవ్వ‌డం ప‌ట్ల సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. కోమ‌టి రెడ్డి కూడా బ‌య‌టి పార్టీ నేత‌ల‌కు వెళ్లి విన‌తిప‌త్రాలు ఇస్తున్నారు. ఆ విధంగా.. ఆయ‌న‌ నిర‌స‌న ఆయ‌న కొన‌సాగిస్తున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హారంతో.. ఆదిలోనే రేవంత్ కు అతి పెద్ద స‌వాల్ ఎదురైన‌ట్టు అయ్యింది. మ‌రి, దీన్ని ఎలా అధిగ‌మిస్తాడు అన్న‌ది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News