వ్యాఖ్యల వెనుక అజెండా ఏమిటి ?

Update: 2022-02-09 15:30 GMT
పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ఏపీ విభజన నాటి విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అడ్డుగోలుగా చేసిన విభజన వల్లే రెండు రాష్ట్రాలు నష్టపోయాయని తెగ బాధపడిపోయారు. విభజన వల్ల ఏపీ ఘోరంగా దెబ్బ తినేసింది అంటూ పాపం సింపతీ ఒలకబోశారు. దానికి కారణమంటు కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోశారు. నిజానికి ప్రధానమంత్రి అయిన ఇన్ని సంవత్సరాలకు రాష్ట్ర విభజన గురించి ఎందుకు ప్రస్తావించారో అర్థం కావటం లేదు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ పాత్ర ఎంతుందో బీజేపీ పాత్ర కూడా అంతే ఉంది. బీజేపీ సంపూర్ణ మద్దతిచ్చిన కారణంగానే కాంగ్రెస్ అడ్డగోలు విభజన చేసింది. సరే విభజన పాపం ఎవరిది ? అడ్డగోలు విభజనను కాంగ్రెస్ ఎందుకు చేసిందనేది అప్రస్తుతం. ఎందుకంటే అదంతా అందరికీ తెలిసిన చరిత్రయిపోయింది. ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతున్న నరేంద్ర మోడీ తాను అన్యాయాన్ని ఏ విధంగా చక్కదిద్దారు ?

అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు ఒక రకమైన అన్యాయం చేస్తే గడచిన ఏడున్నరేళ్ళుగా మోడీ చేస్తున్న అన్యాయం, మోసం ఇంకా పెద్దది. ఎలాగంటే విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్ను మోడియే తుంగలో తొక్కేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులను ఆపేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వటం లేదు. ఇదంతా మోడీ సర్కార్ ఏపీకి చేస్తున్న మోసం. హోలు మొత్తం మీద చెప్పాలంటే మోడీ ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేశారు.

ఒకవైపు తాను ఏపీని దెబ్బమీద దెబ్బకొడుతూ ఇపుడు అసందర్భంగా కాంగ్రెస పై దుమ్మెత్తిపోయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అసలు సందర్భమే లేకుండా రాష్ట్ర విభజన, ఏపీ నష్టాలంటు మోడి ఎందుకు పార్లమెంటులో మాట్లాడారు ? అన్నదే అర్థం కావటం లేదు. కాంగ్రెస్+బీజేపీలు కలిసే ఏపీని దెబ్బ కొట్టాయని అందరికీ తెలుసు. ఇపుడు మోడీ కొడుతున్న దెబ్బేంటో కూడా అందరూ చూస్తున్నారు. కాబట్టే కాంగ్రెస్, బీజేపీలకు జనాలు సరైన బుద్ధి చెబుతున్నారు.
Tags:    

Similar News