అయ్యా ! డిప్యూటీ సీఎం గారూ త‌మ‌రి కాన్ఫిడెన్స్ ఏంటి ?

Update: 2022-03-29 15:30 GMT
అతి చేస్తే గ‌తి చెడుతుందా?
అతి విశ్వాసం అన‌ర్థ‌దాయ‌క‌మేనా !

ఏమో కానీ
రేప‌టి వేళ ఏమౌతుందో చెప్పే
హ‌స్త సాముద్రికం కానీ
సంబంధిత జ్యోతిష్యం కానీ
ఇంకా స‌రైన రీతిలో అందుబాటులో లేదు
 
లేదంటే మ‌న నాయ‌కులు త‌మ ఆస్తులు అయినా
రాసిచ్చేందుకు ఆ విధంగా అన్నీ కోల్పోయి అయినా
అధినాయక‌త్వం మెప్పు పొందేందుకు ఎన్న‌డూ సిద్ధంగానే ఉంటారు !

ఉగాది నుంచి మీరంతా కొత్త జ‌గ‌న్ ను చూడొచ్చు అని అంటున్నారు సీఎం. ఉగాది నుంచి త‌న పాల‌న‌లో రెండో వెర్ష‌న్ మొద‌ల‌వుతుంది అని కూడా అంటున్నారు జ‌గ‌న్. ఆయ‌న మాట‌లు ఎలా ఉన్నా కూడా కేవ‌లం అందులో ఉన్న స్పిరిట్ ను తీసుకుని మున్ముందుకు దూసుకెళ్లాల‌ని వైసీపీ పెద్ద‌లు సూచిస్తున్నారు. పాల‌న‌కు సంబంధించి అత్తెస‌రు మార్కులు సంపాదించిన ఎమ్మెల్యేలు అంతా ఇంటి బాట ప‌ట్ట‌డం ఖాయ‌మని ఇప్ప‌టికే ఓ నిర్థార‌ణకు వ‌చ్చేశారు.

ఆ విధంగా శ్రీ‌కాకుళం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మ‌ళ్లీ టిక్కెట్లు ద‌క్కే ఛాన్స్ లేనేలేద‌ని తేలిపోయింది. ఇక ఇప్పుడిలా ప్ర‌భుత్వానికి మ‌ద్దతుగా, అత్యంత భ‌క్తితోనూ మ‌రియు విశ్వాసంతోనూ మాట్లాడుతున్నారు కదా! అని రేప‌టి వేళ జ‌గ‌న్ కు భ‌జ‌న చేసిన వాళ్లంద‌రికీ ప‌ద‌వులే వ‌స్తాయో లేదా ఛీత్కార‌మే ద‌క్కుతుందో కూడా ఇప్పుడే చెప్ప‌లేం. ఈ ద‌శ‌లో జ‌గ‌న్ రేపటి వేళ ఏ నిర్ణ‌యం తీసుకున్నా అందుకు స‌మ్మ‌తి తెలిపేందుకు తాను సిద్ధ‌మేనని సీనియ‌ర్లు అయిన బొత్స తో పాటు ధ‌ర్మాన కూడా ప్రక‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంటే వీళ్ల‌ద్ద‌రినీ త‌ప్పిస్తారు అని తేలిపోయింది.

మ‌రో ముఖ్య‌మ‌యిన విష‌యం ఏంటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో దాస‌న్న‌కు టికెట్ కూడా ఇవ్వ‌ర‌న‌రి తెలుస్తోంది. అందుకే ఇప్ప‌టి నుంచే తాను వ‌చ్చేసారి పోటీ చేసినా చేయ‌కపోయినా క‌నీసం ఎమ్మెల్సీగా అయినా నామినేట్ అయి మంత్రి ప‌ద‌వి కొడ‌తాన‌ని మొన్న‌టి వేళ తేల్చేశారు. అందుక‌నో ఎందుక‌నో తీవ్ర అభ‌ద్ర‌త నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సీఎంను ప్ర‌స‌న్నం చేసుకునే వ్యాఖ్య‌లేవో వెల్ల‌డి చేస్తూ త‌న‌దైన  రాజ‌కీయం ఒక‌టి న‌డుపుతున్నార‌ని టీడీపీ అంటోంది. ఇప్ప‌టికే ఇంటా మరియు బ‌య‌టా న‌మ్మ‌కాల‌ను కోల్పోయిన దాస‌న్న త‌న‌దైన ప‌ద్ధ‌తిలో లాజిక‌ల్ వే లో డ్రామా న‌డుపుతున్నార‌ని వైరి వ‌ర్గాలు వ్యాఖ్య‌లు చేస్తున్నాయి.

ఈ ద‌శ‌లో డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ దాసు మ‌రో ఆస‌క్తి దాయ‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం కాక‌పోతే త‌న ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా రాజ‌కీయాల నుంచే త‌ప్పుకుంటాన‌ని మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. శ్రీ‌కాకుళం జిల్లా, న‌ర‌స‌న్న‌పేట మండ‌లం, కంబ‌కాయ గ్రామంలో ఫిష్ లే ఔట్ ను ప్రారంభించి అనంత‌రం మాట్లాడారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రి మాట్లాడిన కొద్దిసేప‌ట్లోనే సోష‌ల్ మీడియాలో ఆ వ్యాఖ్య‌లు ట్రోల్ అవుతున్నాయి.
Tags:    

Similar News