బద్వేల్ లో కాంగ్రెస్ ప్లేస్ ఏంటంటే... ?

Update: 2021-10-17 08:08 GMT
ఏపీలో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. బద్వేల్ లో అధికార వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్య దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధ పోటీలో ఉన్నారు. ఆమె విజయం అయితే ఖాయం. ఇక టీడీపీ బరిలో లేదు, మరో వైపు చూస్తే జనసేన కూడా తప్పుకుంది. వైసీపీని ఢీ కొడతామంటూ రెండు జాతీయ పార్టీలు భలేగా సవాల్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు జాతీయ పార్టీలకు 2019 ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. దాంతో బే ఫికర్ గా వైసీపీ ఉంది. ఇక వైసీపీతో పోటీ అని చెప్పుకుంటూ బరిలోకి దిగిన కాంగ్రెస్ బీజేపీ నిజానికి తమలో తామే పోటీ పడుతున్నాయి. అదెలా అంటే ఈ ఉప ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అన్న దానిమీదట. అంటే బీజేపీ కంటే తామే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటామని కాంగ్రెస్ అంటోంది. తమకు బేస్ ఉందని, ఏరోజూ రాయలసీమ‌లో డిపాజిట్లు తెచ్చుకోని బీజేపీతో తమకు  పోటీ ఏంటి అన్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉంది.

బద్వేల్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ గా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. ఆమె 2009 ఎన్నికల్లో బలమైన టీడీపీ అభ్యర్ధిని ఓడించి మరీ గెలిచారు. ఇక ఆమెకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలందరికీ సుపరిచితం కావడం. అయిదేళ్ల పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో చేసిన ప్రగతి  కార్యక్రమాలు చెప్పుకోవడం. దానికి మించి తాను పక్కా లోకల్ అని కూడా అంటున్నారు. ఇక కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ ఉన్నా అది వైసీపీకి మొత్తానికి మొత్తం షిఫ్ట్ అయిపోయింది. అయినా సరే కమలమ్మకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు ఎంతో కొంత తమకు హెల్ప్ అవుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే కాంగ్రెస్ టీడీపీ ఓట్లను నమ్ముకోవడం, తమ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి ఇచ్చేసి పసుపు పార్టీ వెంటబడడం చిత్రంగా ఉన్నా కాంగ్రెస్ కి ఇది తప్పని పరిస్థితి. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి పడిన యాభై వేల ఓట్లలో ఎన్నో కొన్ని తమకు టర్న్ అవుతాయన్న నిబ్బరాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా టీడీపీ నేతలతో లోపాయికారీగా మంతనాలు కూడా చేస్తున్నారు.

నిజానికి టీడీపీ ఇక్కడ స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తోంది అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ని ఎంతో కొంత పెంచితే రేపటి రోజున ఆ నష్టం, కష్టం తప్పకుండా వైసీపీవే అన్నది టీడీపీ ప్లాన్. మెల్లగా కాంగ్రెస్ లేస్తే వైసీపీ నుంచి పోయిన తమ ఓటు బ్యాంక్ ని ఎంతో కొంత వెనక్కి తెచ్చుకునే వీలుంటుంది. దాంతో టీడీపీ వ్యూహం ప్రకారం కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే పోయేది ఏమీ లేదు, పైగా అది చివరికి వైసీపీనే దెబ్బ తీస్తుంది. అందుకే టీడీపీ ఓట్లు చివరి నిముషంలో బాగానే కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతాయని అంటున్నారు. మరో వైపు రేపటి ఎన్నికల్లో పొత్తు కోసం బీజేపీ వైపు టీడీపీ చూస్తోంది.

దాంతో ఈ రోజు బీజేపీకి మద్దతు ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా ఉంది. అయితే టీడీపీ హై కమాండ్ మాత్రం బీజేపీ బలపడితే అది మళ్లీ పాతుకుపోతుంది అనే అలోచిస్తోందిట. అందువల్ల బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అని భావిస్తోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ కాంగ్రెస్ లలో హస్తంతోనే నేస్తం చేసేందుకు పసుపు పార్టీ సిద్ధ పడితే మాత్రం బద్వేల్ లో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతాయి. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా బద్వేల్ లో బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వస్తాయన్న ప్రచారం అయితే గట్టిగానే ఉందిమరి.
Tags:    

Similar News