సర్కారుకు.. నిమ్మగడ్డకు మధ్య మెసేజ్ రచ్చేంది?

Update: 2020-10-25 05:50 GMT
ఒకరు ఉప్పు అయితే మరొకరు నిప్పు. ఒకరు లాగితే.. మరొకరు చిరిగే వరకు ఊరుకోరు. తమది తప్పు కాదంటే తమది తప్పు కాదని తేల్చేస్తుంటారు. రూల్ బుక్ ను యథావిధిగా అమలు చేస్తే.. ఇష్యూనే ఉండదు. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరించటంతోనే అసలుచిక్కంతా. ఏపీ సర్కారుకు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య నడిచే కోల్డ్ వార్ మరో మలుపు తిరిగింది.

కరోనాకు ముందు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంటే.. నో అంటూ రమేశ్ కుమార్ అడ్డం తిరగటమే కాదు.. ఆ ఇష్యూలో తమకున్న అధికారాలతో ఎన్నికల్ని వాయిదా వేయగలిగారు. అనంతరం.. ఆయన్ను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించం.. ఈ వ్యవహారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. తన వాదన వినిపించిన నిమ్మగడ్డ.. ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతల్ని చేపట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలన్న ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నారు. ఇలాంటివేళ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్య చేశారు. నిమ్మగడ్డ పదవిలో ఉండేది కొద్ది నెలలే అని.. అప్పటివరకు తాము స్థానిక ఎన్నికల్ని నిర్వహించటం కుదరదన్నారు. స్థానిక ఎన్నికల్ని పెట్టాలంటే ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం సంప్రదించాల్సిందేనని చేసిన ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సర్కారుకు.. నిమ్మగడ్డకుమధ్య మెసేజ్ వార్ షురూ అయినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద జరిగే మీటింగ్ రావాలని సీఎస్ నీలం సాహ్ని నుంచి ఎన్నికల కమిషన్ కు మెసేజ్ ఒకటి పంపారు. దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కమిషనర్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉంటారని.. అలాంటి వారిని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ మెసేజ్ లు..ఆర్డర్లు వేయటం సరికాదన్నారు.

ఈ విషయంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా ఎవరూ కూడా సమావేశానికి హాజరు కాకూడదని నిమ్మగడ్డ ఆర్డర్ వేశారు. ఎన్నికల సంఘం అధికారుల్ని సీఎస్ సమావేశానికి పిలవటం ఏ మాత్రం సబబు కాదన్న మాట వినిపిస్తోంది. మరీ.. రచ్చ ఎంతవరకు వెళుతుందో చూడాలి.
Tags:    

Similar News