మోడీ గోత్రం అదేనా? ఇప్పుడెందుకు ఇదో చర్చగా మారింది?

Update: 2022-02-07 03:40 GMT
ప్రపంచంలోనే అతి పెద్దదైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించటం తెలిసిందే. దాదాపు రూ.వెయ్యి కోట్ల ఖర్చుతో త్రిదండి చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీగా సేకరించిన విరాళాలతో ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేశారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ హాజరు కావడం.. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన స్వయంగా హాజరై.. నిర్వహించటం తెలిసిందే.

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ హాజరైన నేపథ్యంలో.. పూజ సందర్భంగా ఆయన గోత్రనామం బయటకు రావటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు పలు పూజల్లో  హాజరైనప్పటికీ.. బహిరంగంగా ఆయన గోత్రం ఫలానా అన్నది బయటకు వచ్చింది లేదు. దీంతో.. ఇప్పుడీ అంశం మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముచ్చింతల్ లో పండితుల నోటి నుంచి వచ్చిన మోడీ గోత్రం.. కశ్యప గోత్రంగా బయటకు వచ్చింది.

అయితే.. అది  ఆయన అసలు గోత్రం కాదనే మాట పలువురి నోట వినిపిస్తోంది. కారణం ఏమంటే.. సాధారణంగా ఎదుటి వ్యక్తి గోత్రం తెలియనప్పుడు లేదంటే గోత్రం అంటే తెలీని వారిగా ఉంటే.. సదరు వ్యక్తిని కశ్యప గోత్రంగా ఆశీర్వదించటం పండితులు చేస్తుంటారని చెబుతున్నారు. పూజ సందర్భంగా ప్రధానమంత్రి మోడీని.. మీ గోత్రం ఏమిటి? అన్న ప్రశ్నను అడిగే సాహసం చేయరు. అందుకే.. ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని కశ్యప గోత్రాన్ని పఠించి ఉంటారని చెబుతున్నారు.

ఇక.. ఆయన సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే.. ఆయన ఓబీసీగా సుపరిచితులు. గాంచీ లేదంటే తలికల లేదంటే తేలీ ఫ్యామిలీలో పుట్టిన నరేంద్ర మోడీకి గోత్రం ఉందో లేదన్న విషయంపై చాలామందికి స్పష్టత లేదు. ముచ్చింతల్ కార్యక్రమం సందర్భంగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని కొందరు చూసే ప్రత్యేక కోణంలో చూసినప్పుడు.. ఇద్దరు బీసీ నేతలు (మోడీ.. తమిళ సై)ముందు కూర్చోబెట్టి.. త్రిదండి జీయర్ స్వామి భారీ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారని చెప్పాలి. మొత్తానికి ముచ్చింతల్ లో పూజ చేసిన ప్రధాని మోడీ కారణంగా.. ఆయన గోత్రనామంగా బయటకు వచ్చిన కశ్యప గోత్రంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Tags:    

Similar News