'క్వాలిటీ ఆఫ్ డెత్' లో భారత్ స్థానమెంత?

Update: 2022-01-28 10:43 GMT
మనిషి జీవితకాలం ఒకప్పుడు వందేళ్లు. పెద్దలు ఎవరికైనా ఆశీర్వాదం ఇవ్వాలన్నా కూడా నిండు నూరేళ్లు చల్లగా ఉండు అని దీవించేవారు. అయితే కాలక్రమేణ ఆయు: ప్రమాణం తగ్గిపోయింది. మానవ జీవిత కాలం 60 నుంచి 70 ఏళ్లకే పరిమితమైంది. ఇందుకు రకారకాల కారణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది. అయితే జీవించడం అంటే కేవలం బతకడం కాదు.. అది ఎంత గొప్పగా బతికామన్నది ప్రత్యేకం. అయితే ఇందులో మరణం కూడా ఎంత క్వాలిటీగా ఉందో తెలుసుకోవడానికి కొన్ని సంస్థలు పరిశోధనలు జరిపాయి.

క్వాలిటీ మరణం అంటే... మరణించే ముందు వారి జీవన విధానం. చివరి రోజుల్లో ఎటువంటి జీవితం గడుపుతారనేది చాలా ముఖ్యమైన అంశమని అంటోంది అమెరికా యూనివర్శిటీ డ్యూక్. క్వాలిటీ ఆఫ్ డెత్ అండ్ డైయింగ్ 2021 పేరిట అధ్యయనం చేసింది. ఎన్ని దేశాల్లోని ప్రజలు సుఖవంతమైన మరణం పొందుతున్నారో పరిశోధనలు చేసింది. ఆయా దేశాల స్థానాల జాబితాను రూపొందించింది. అందుకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది.

ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఆధారంగా 81 దేశాల్లో ఈ క్వాలిటీ ఆఫ్ డెత్ అండ్ డైయింగ్ పరిశోధనలు చేపట్టింది. ఫలితాలను బట్టి గ్రూపులుగా విభజించింది. దేశాల జాబితాను ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ గా స్థానాలను రూపొందించింది. ప్రశాంతమైన మరణాలు కేవలం ఆరు దేశాల్లోనే ఉన్నాయని తేల్చింది. భారత్, రష్యా, చైనా, చిలీ, గ్రీస్, వియత్నాం, జార్జియా, మెక్సికో దేశాలు గ్రూప్ డీలో స్థానం సంపాదించుకున్నాయి. యూకే, తైవాన్, ఐర్లాండ్, దక్షిణ కొరియా, కోస్టారికా, ఆస్ట్రేలియా దేశాలు గ్రూపు ఏలో ఉన్నాయి. అమెరికా, థాయ్ లాండ్, కొలంబియా, ఘనా, ఉగాండా, ఈజిప్టు, నైజీరియా, డెన్మార్ దేశాలు గ్రూప్ సీలో స్థానం దక్కించుకున్నాయి. ఇకపోతే గ్రూప్ ఎఫ్ లో ఏకంగా 21 దేశాలు ఉన్నాయి.

 ఎక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలు మాత్రమే ప్రశాంతమైన మరణం పొందుతున్నారని ఈ పరిశోధనల్లో తేలింది. వారి చివరి రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా... సుఖంగా ఉంటున్నారని గుర్తించారు. ఇక తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఉండేవారికి చివరి రోజుల్లోనూ తిప్పలు తప్పడం లేదని అంటున్నారు. పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉంటున్నాయని... వారు మరణించేముందు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.  అయితే క్వాలిటీ ఆఫ్ డెత్ విషయంలో భారత్ స్థానం 59 కాగా... అగ్రరాజ్యం అమెరికా 43గా నిలిచింది.
Tags:    

Similar News