హోం వర్కు చేయకుండా టీవీ చూసే పిల్లాడికి ఆ పేరెంట్స్ వేసిన శిక్ష తెలిస్తే షాకే

Update: 2022-11-28 04:06 GMT
కుటుంబ జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపిన వస్తువు ఏదైనా ఉందంటే అది టీవీ. ఇది రాక ముందు.. వచ్చిన తర్వాత అన్నట్లుగా మారిపోయింది మానవ జీవితం. టీవీ పుణ్యమా అని మనిషి లైఫ్ లో లెక్కలేనన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. పెద్దలే టీవీలకు బానిసలుగా మారితే..

పిల్లలు మారకుంటారా? ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో టీవీతో వచ్చే సమస్యలు అంతా ఇంతా కాదు. అలాంటిదే ఒకటి చైనాలో చోటు చేసుకుంది. ఎంత చెప్పినా తమ పిల్లాడు టీవీ చూడటం మానకపోవటం.. హోంవర్కు చేయాలని చెబితే.. ఆ పని చేయకుండా టీవీ చూసిన వైనంపై ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆ చిన్నారికి వెరైటీ శిక్ష వేశారు.

ఈ శిక్ష అక్కడి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెర తీసింది. చైనాలోని హునాన్ ప్రొవిన్స్ లో నివసిస్తున్న దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల వారు బయటకు వెళుతూ.. కొడుకును హోంవర్కు పూర్తి చేయాల్సిందిగా చెప్పారు. హోంవర్కు పూర్తి అయ్యాక రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో నిద్రపోవాలని చెప్పి వారు బయటకు వెళ్లారు. అలా వెళ్లిన వారు ఆలస్యంగా ఇంటికి వచ్చారు. అయితే.. తమ కుమారుడు హోంవర్కు చేయకుండా.. టీవీ చూస్తూ ఉండిపోయిన వైనాన్ని గుర్తించారు.

వారు వచ్చిన తర్వాత పిల్లాడు పడుకోవటానికి  వెళుతుండగా.. ఆ పిల్లాడికి వారు విచిత్రమైన శిక్ష వేశారు. పడుకోవద్దని.. టీవీనే చూడాలని కండీషన్ పెట్టారు. టీవీ ఆన్ చేసి.. ఆ పిల్లాడి పక్కనే ఇద్దరూ కూర్చున్నారు. నిద్ర పోకుండా కాపలా కాశారు. కాసేపటి వరకు టీవీ బాగానే చూసిన పిల్లాడు ఆ తర్వాత అలసటతో టీవీ చూసేందుకు ఆసక్తి చేపలేదు. నిద్ర పోయేందుకు ప్రయత్నిస్తే.. తల్లిదండ్రులు బలవంతంగా టీవీ చూడాలని చెప్పసాగారు.
కాసేపటికి అలసటతో నిద్ర పోతానంటూ ఏడవటం మొదలు పెట్టాడు.

అయినప్పటికీ వదలకుండా ఆ పిల్లాడి చేత ఉదయం 5 గంటల వరకు టీవీ చూపిస్తూనే ఉన్నారు. తమ కొడుక్కి వేసిన శిక్ష తమకు పాజిటివ్ రిజల్ట్ వచ్చేలా చేసిందని తల్లిదండ్రులు సంతోషంగా చెబుతుంటే.. నెటిజన్లు మాత్రం.. చిన్న పిల్లాడికి అంత కఠినమైన శిక్ష వేస్తారా? అంటూ మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం పిల్లల్ని దారికి తెచ్చేందుకు అలా చేయటం తప్పేం కాదంటూ సమర్థించటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఈ ఉదంతంపై చైనాలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News