ఆ ఎంపీ అంత కార్న‌ర్ కావ‌డానికి రీజ‌నేంటి..?

Update: 2021-05-27 03:30 GMT
ఔను! విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని గురించిన చ‌ర్చ బెజ‌వాడ‌ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. విజ‌య‌వాడ ఎంపీగా నాని వ‌రుస విజ‌యాలు సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న నాని.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ.. విజ‌య‌వాడ పీఠాన్ని త‌న ఖాతాలో వేసుకు న్నారు. దీంతో అంతా నా ఇష్టం! అనే రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వాద‌న ఏడాదిన్న‌ర కాలంగా వినిపిస్తోంది. టీడీపీ టికెట్ గెలిచిన వెంట‌నే నాని.. పార్టీకి బ‌ద్ధ‌శ‌త్రువులైన బీజేపీ నేత‌ల‌తో అంట‌కాగారు. ఆ మాటకు వ‌స్తే 2014లో బీజేపీ -  టీడీపీ మిత్రులుగా ఉన్న‌ప్ప‌టి నుంచే నాని అప్ప‌టి బీజేపీ కేంద్ర మంత్రులో చెలిమి చేసేవారు.

ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత రిజ‌ల్ట్ వ‌చ్చిన రెండు మాసాల‌కే మ‌హారాష్ట్ర‌కు వెళ్లి.. కేంద్రం మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో భేటీ అయ్యారు. ఈ ప‌రిణామం.. పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పార్టీ నేత‌ల‌కు దూరంగా.. త‌న సొంత రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ఇంత‌లోనే కార్పొరేష‌న్ ఎన్నిక‌లు తెర‌మీదికి రావ‌డంతో.. త‌న కుమార్తె శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా త‌నంత‌ట త‌నే ముందు ప్ర‌క‌టించ‌డం మ‌రింత వివాదానికి దారితీసింది. అధినేత చెప్పిన వారే మేయ‌ర్ .. అంటూ.. కొంద‌రు నాయ‌కులు చేసిన కామెంట్ల‌ను సైతం నాని తిప్పి కొట్టారు.

``క‌నీసం వంద మందితో ఓట్లు వేయించ‌డం కూడా చేత‌కానివాళ్లు చేసే కామెంట్ల‌ను ప‌ట్టించుకోను!`` అని వ్యాఖ్యానించి.. మ‌రింత సంచ‌ల‌నం రేపారు. దీంతో ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా త‌దిత‌ర నేత‌ల‌కు, ఎంపీకి మ‌ధ్య తీవ్ర వివాదం సాగింది. ఇక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వ‌చ్చే ఎన్నిక‌ల గురించి అప్పుడే మంత‌నాలు ప్రారంభించార‌నే వ్యాఖ్య‌లు.. ఎంపీ అనుచ‌రుల నుంచి వినిపిస్తున్నాయి.

అది కూడా పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెకు ఛాన్స్ ఇచ్చుకునేందుకు ప్రయత్నించ‌డం ఇక్క‌డి మాజీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు జ‌లీల్ ఖాన్‌కు ఇబ్బందిగా మారింది. దీంతో ఈయ‌న వ‌ర్గం కూడా ఇటీవ‌ల కాలంలో ఎంపీ వ‌ర్గానికి దూరంగా జ‌రిగిపోయింది. జ‌లీల్ ఖాన్ టీడీపీకి కొత్త నేతే అనుకున్నా.. సీనియ‌ర్లు కూడా ఎంపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఎంపీ దూకుడు నిర్ణ‌యాలు.. ఎవ‌రినీ లెక్క చేయ‌క‌పోవ‌డం.. వంటివి.. ఆయ‌న‌ను కార్న‌ర్ చేసేలా చేస్తున్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News