టీమిండియా కోచ్ గా కుంబ్లే నిష్ర్కమణ వెనుక ఇంత కథ ఉందా?

Update: 2022-02-05 23:30 GMT
అనిల్ కుంబ్లే.. భారత క్రికెట్ చరిత్రలో చెరిగిపోని పేరు. ఆట పట్ల అంకితభావానికి మారు పేరు. ఒకసారి సరిగ్గా 20 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తో అంటిగ్వాలో జరిగిన టెస్టు మ్యాచ్ ను గుర్తుచేసుకోండి. దవడకు గాయమైనా వెరవకుండా.. కట్టు కట్టుకుని వచ్చి మరీ బౌలింగ్ కు దిగిన అతడు మేటి బ్యాట్స్ మన్ బ్రియాన్ లారా వికెట్ పడగొట్టాడు. 132 టెస్టుల్లో 619 వికెట్లు.. 271 వన్డేల్లో 337 వికెట్లు. సమీప భవిష్యత్ లో  మరే భారత్ బౌలర్ కూ సాధ్యమయ్యేలా కనిపించని రికార్డులివి. అలాంటి కుంబ్లే 2016లో టీమిండియా హెడ్ కోచ్ గా రావడంతో అందరూ సంతోషించారు. అపార అనుభవం ఉన్న కుంబ్లే హయాంలో భారత జట్టు మరో మెట్టు ఎక్కుతుందని భావించారు. కానీ, అనూహ్యంగా కుంబ్లే కేవలం ఏడాది కూడా కోచ్ గా మనలేకపోయాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు ఇందుకు కారణమే వాదనలు వచ్చాయి. అంతేకాక కుంబ్లే హెడ్ మాస్టర్ ధోరణితోనే సమస్య మొదలైందన్న వార్తలు వినిపించాయి. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ పరాభవ భారం  వెంటాడుతుండగా కుంబ్లే లాంటి దిగ్గజం అవమానకర రీతిలో 2017లో కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాడు.  నాడు జట్టులో అసలేం జరిగింది? అనేది ఇప్పటికీ రహస్యమే. దీనిపై తాజాగా బీసీసీఐ మాజీ మేనేజర్ రత్నాకర్ శెట్టి వివరాలు వెల్లడించాడు.

కోహ్లికి నచ్చకనేనా?

వాస్తవానికి ప్రస్తుత భారత క్రికెట్ లో ప్రత్యక్షంగా చూస్తే కోచ్ పాత్ర పరిమితం. కానీ, సాంకేతిక అంశాల కారణంగా ఆటగాళ్లు సమస్యల్లో ఉన్నప్పుడు కోచ్ అవసరం పడుతుంది. వారిని వైఫల్యాల నుంచి బయటపడేయడం, మనో ధైర్యం నింపడం కోచ్ పని. ఇప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్.. సీనియర్ బ్యాట్స్ మన్ రహానే, పుజారాలకు ఇలానే అండగా నిలిచాడు. కానీ, కుంబ్లే హెడ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు  ఆటగాళ్లకు ఇలా అండగా ఉండలేదనేది రత్నాకర్ మాట. డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాడని కోహ్లీ భావించినట్లు రత్నాకర్‌ శెట్టి పేర్కొన్నాడు. ‘On Board: Test.Trial.Triumph. My years in BCCI’ పుస్తకంలోని శెట్టి ఆసక్తికర విషయాలను ఇటీవల బయటపెట్టాడు. అందులో కుంబ్లే టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా తప్పుకోవడానికి కారణాలను ప్రస్తావించాడు.

సెహ్వాగ్ అనుకుంటే.. కుంబ్లే

తన పుస్తకంలో రత్నాకర్ శెట్టి.. కుంబ్లే కోచ్ గా వచ్చిన విధానం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘2016 మే నెలలో ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో వీరేందర్‌ సెహ్వాగ్‌, సచిన్‌ తెందూల్కర్‌ను నేను వాంఖడే మైదానంలో కలిశాను. అప్పుడు సెహ్వాగ్‌ నాతో మాట్లాడుతూ.. టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ పదవికి దరఖాస్తు చేయాలని నాటి బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ తనకు సూచించాడని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత నేను ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లగా.. అక్కడే సీఓఏ (కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌) మీటింగ్‌ జరిగింది. అందులో కమిటీ సభ్యులు వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీతో పాటు నేను, అనిల్‌ కుంబ్లే, కోహ్లి (వర్చువల్‌గా) సమావేశమయ్యాము. టీమ్‌ఇండియా భవిష్యత్‌ ప్రణాళికలు, హెడ్‌కోచ్‌గా ఎవరిని ఎంపిక చేద్దామనే విషయాలను వినోద్‌ అందర్నీ అడిగారు. అయితే, ఆయనే మళ్లీ కలగజేసుకొని.. కుంబ్లేనే కోచ్‌గా కొనసాగిద్దామని చెప్పారు. దాంతో నేనూ, కుంబ్లే షాకయ్యాం’ అని రత్నాకర్‌ వివరించాడు. ‘ఇక వినోద్‌ అలా చెప్పేసరికి అంతకుముందు సెహ్వాగ్‌ నాతో చెప్పిన విషయాన్ని కుంబ్లేతో పంచుకున్నా. కచ్చితంగా శ్రీధర్‌.. సెహ్వాగ్‌ను కోచ్‌గా దరఖాస్తు చేయాలని సూచించలేదని అప్పుడు నాకు అర్థమైంది’’ అని వివరించాడు.

కోచ్ గా కుంబ్లే పై అయిష్టత?

ఇదే సమయంలో కుంబ్లేను కోచ్‌గా కొనసాగించడానికి పలువురు ఇష్టపడట్లేదని అనిపించిందని రత్నాకర్ చెప్పాడు. ‘‘కోహ్లి, కుంబ్లే ఆలోచనా విధానాలు సైతం భిన్నంగా ఉన్నాయి. అప్పుడు కెప్టెన్‌దే పైచేయిగా సాగింది. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు లండన్‌లో మరో సమావేశం జరిగింది. దానికి కోహ్లి, కుంబ్లేతో పాటు శ్రీధర్‌ పలువురు బీసీసీఐ పెద్దలు హాజరయ్యారు. ఈ విషయం తర్వాత తెలిసింది. అయితే, కుంబ్లేతో కోహ్లి సంతోషంగా లేడని.. ఆటగాళ్లకు అండగా ఉండకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో విభేదాలు సృష్టిస్తున్నాడని విరాట్‌ భావించాడు. చివరికి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలయ్యాక కుంబ్లే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు’’ అని రత్నాకర్‌ తన పుస్తకంలో పొందుపరిచాడు.

రత్నాకర్ వాదన ఎంతవరకు నిజం..?

రత్నాకర్ మేనేజర్ గా, కోశాధికారిగా బీసీసీఐలో చాలాకాలం పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. అతడు తాజాగా వెలిబుచ్చిన అభిప్రాయాల్లో చాలా వరకు నిజాలు ఉండవచ్చు. కానీ, కుంబ్లే విషయంలో మాత్రం ఏకపక్షంగా అభిప్రాయాలు చెప్పాడని కనిపిస్తోంది. దాదాపు 18 ఏళ్లు టీమిండియా ప్రధాన స్పిన్నర్ గా బాధ్యతలు మోసిన కుంబ్లే ఎలాంటివాడో అందరికీ తెలిసిందే. నిఖార్సయిన జెంటిల్ మన్ గా అతడికి పేరుంది. ఇక ఆట పట్ల కుంబ్లే అంకిత భావం గురించి ఎవరికీ అనుమానాల్లేవు. అలాంటి వ్యక్తి జట్టు ఆటగాళ్లకు అండగా నిలవలేదని, డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు రేపుతున్నాడని చెప్పడం నమ్మశక్యంగా లేదు. అంతేకాక, భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ తో దశాబ్దంపైగా ఆడిన వ్యక్తి కుంబ్లే. అలాంటి వ్యక్తి గురించి రత్నాకర్ పుస్తకంలోని విషయాలు కొంత ఆశ్చర్యకరమే.
అసలేం జరిగి ఉంటుందబ్బా?

కుంబ్లే, కోహ్లి కోచ్ -కెప్టెన్ గా ఉన్న కాలం 2016. అప్పట్లో కోహ్లి బ్యాటర్ గా, కెప్టెన్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. తిరుగులేని ఫామ్ తో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు. అలాంటి సమయంలో కోచ్ గా వెళ్లాడు కుంబ్లే. తనదైన శైలిలో కొన్ని చర్యలు తీసుకోవాలని భావించి ఉంటాడు. కానీ, కోహ్లికి అవి నచ్చలేదు. సహజంగానే ఇది భేదాభిప్రాయాలకు దారితీసి ఉంటుంది. దీంతో తనంతట తాను తప్పుకొన్నాడు. అదే కోహ్లి జాతకం.. సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేనాటికి పూర్తిగా మారిపోయింది. ఆటగాడిగా మునుపటి స్థాయిలో పరుగులు చేయలేక.. మూడు ఫార్మాట్లకూ కెప్టెన్సీని వదులుకొన్నాడు. దీనికి గంగూలీని తప్పుబట్టలేం కదా? నాటి కుంబ్లే ఉదంతమూ ఇంతే.
Tags:    

Similar News