గులాబీ ఎమ్మెల్యేల ట్రాప్ డీల్ ఎంత? పట్టుకున్నది ఎంత?

Update: 2022-10-27 04:11 GMT
తెలంగాణ అధికారపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన మధ్యవర్తులుగా చెబుతున్న వారు మొయినాబాద్ లోని టీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో డీల్ సెట్ చేసేందుకు ప్రయత్నించటం.. పార్టీ మారేందుకు డీల్ మాట్లాడేందుకు వచ్చిన వారిని ట్రాప్ చేసి మరీ పట్టించినట్లుగా చెబుతున్న వైనం ఇప్పుడు పెను సంచనలంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో హోరాహోరీ పోరు సాగుతున్న వేళ.. ఇలాంటి ఉదంతం తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకూ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఆఫర్ చేసిన మొత్తం భారీగా ఉండటమే కాదు.. ఇది నిజమేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూసినప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల మొత్తం.. కాంటాక్టులు ఇస్తామన్న ప్రలోభంతో ఈ డీల్ షురూ అయినట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఈ మొత్తం డీల్ విలువ రూ.100 కోట్లు అన్న ప్రచారం నడుస్తోంది. అయితే.. అందులో నిజం లేదని.. డీల్ మొత్తం విలువ రూ.400 కోట్లుగా చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. సాధారణంగా ఇలాంటి అరుదైన సందర్భాల్లో ఎంతకు ట్రాప్ అయ్యారన్న విషయాన్ని వెల్లడించేందుకు ఒక క్రమపద్దతిని అనుసరిస్తారు. కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఈ ఉదంతం మీడియాలో రావటానికి ముందే.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ రూ.100 కోట్ల మాట పెద్ద ఎత్తున వినిపించింది. మరి. .ఇంత భారీ డీల్ కు సంబంధించి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఫామ్ హౌస్ కు పిలిచి మరీ ఇస్తారా? ఒకవేళ ఇచ్చారనే అనుకుందాం? ఆ మొత్తం ఎంత? అన్నప్పుడు కొందరు రూ.15 కోట్లుగా చెబుతున్నారు.

మరి.. సదరు రూ.15 కోట్ల మొత్తాన్ని చూపించొచ్చుగా? అన్నది ప్రశ్నగా మారింది. అప్పట్లో ఓటుకు నోటు ఎపిసోడ్ లో ఇప్పటి టీపీసీసీ అధ్యక్షుడు.. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు బ్యాగులో తీసుకెళ్లటం తెలిసిందే.

తాజా ఎపిసోడ్ లో డబ్బులు ఉన్నట్లుగా రెండు బ్యాగులు చేూపిస్తున్నారు. కానీ.. ఆ బ్యాగుల్లో రూ.15 కోట్ల మొత్తం పట్టేంత పరిస్థితి ఉందా? అన్నది సందేహం. ఒకవేళ.. నిజంగానే రూ.15 కోట్ల భారీ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటే.. ఆ మొత్తాన్ని మీడియా ముందు చూపించొచ్చు కదా? అన్నది మరో ప్రశ్న. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు తెర మీదకు వచ్చేలా ట్రాప్ డీల్ ఎపిసోడ్ నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News