మంత్రి అయ్యాక ఈ వైరాగ్యమేంటి సారూ..?

Update: 2022-04-16 07:31 GMT
పదవి రాకపోతే వైరాగ్యం వస్తుంది. అది ఎవరైనా కావచ్చు. అవును కదా సరే కదా  అని అనుకోవచ్చు. కానీ పదవి చేతిలో పడ్డాక అది కూడా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా వ్యవహరమే  పచ్చిగా ఉండగానే రాజకీయాల గురించి వైరాగ్య భావన వ్యక్తం చేయడం నిజంగా ఆశ్చర్యమే.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొత్త  రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలాంటి భావననే వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలు వద్దు అనిపిస్తోంది అని ఆయన తాజాగా అంటున్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఈ మాటలు అన్నదీ చెప్పిన సందర్భం గురించి ఆలోచించుకుంటే చిత్రంగా ఉంటుంది. దాదాపుగా ఎనిమిదేళ్ళుగా అధికార పదవి ప్రసాదరావు దరి చేరలేదు. ఆయన చివరిసారిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేశారు.

ఇక 2014 ఎన్నికల వేళకు వైసీపీలో చేరితే ఆయనా ఓడారు, పార్టీ కూడా ఓడింది. ఇక 2019 ఎన్నికల వేళకు ఆయనా గెలిచారు, పార్టీ గెలిచింది. మంత్రి పదవి ఖాయమని అనుకున్న వేళ అన్న క్రిష్ణ దాస్ కి పదవి వెళ్లిపోయింది. కాస్తా ఆలస్యంగా అయినా మంత్రి అయ్యారు ప్రసాదరావు. దాంతో క్యాడర్ లో ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. వారంతా కలసి అభినందన సభను శ్రీకాకుళంలో ఏర్పాటు చేసి మరీ సంబరాలే చేశారు.

ఈ సభలో మాట్లాడిన ధర్మాన అభిమానులకు  కాస్తా నిరుత్సాహం కలిగించే కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ఆయన అన్న మాటలేంటి అంటే తనకు వయసు పై బడుతోంది, రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని. శుభమాని పదవి చేతిలో పెట్టుకుని ఊళ్ళోకి వచ్చిన సారు ఇలా డీలాగా మాట్లాడమేంటి అని క్యాడర్ సైతం షాక్ తింది. అంతే కాదు, ధర్మాన మాటలలో మరిన్ని విశేషాలు ఉన్నాయి. రాజకీయాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఉంటుందని కూడా అన్నారు.

వయసు పైబడుతోందని ఆయనకు ఆయనే చెప్పుకున్నారు. నిజానికి ఆయన అన్న క్రిష్ణదాస్ ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. అందరి కంటే పెద్దాయన చంద్రబాబు ఈ రోజుకీ చురుకైన రాజకీయం చేస్తున్నారు. మరి ప్రసాదరావుకి వయసు పైబడడం ఏంటో కూడా అనుచరులకు అర్ధం కాని పరిస్థితి.

రెవిన్యూ శాఖలో అవినీతి పెచ్చుమీరిందని కూడా ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు. దానికి అంతా సిగ్గుపడాలని కూడా అన్నారు. స్వయాన ఆ శాఖకు మంత్రిగా తాను నియమితులైన వేళ ప్రసాదరావు ఈ మాటలు ఎందుకు అంటున్నారో అర్ధం కావడంలేదు మరి.   అలాగే,  కులాన్ని, మతాన్ని చూసి ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు. నిజాయతీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం అందుకు నిదర్శనమని మంత్రి అనడమూ విశేషమే.

మొత్తానికి ఆనందంగా  ఉండాల్సిన వేళ, కేడర్ కేరింతలు కొడుతున్న వేళ ప్రసాదరావు వారు ఉత్సాహాన్ని తగ్గించేలా ఎందుకు మాట్లాడారు అన్నదే చర్చ. ప్రసాదరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరా ఏంటి అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. చూడాలి మరి.
Tags:    

Similar News