మహారాష్ట్రలో సంక్షోభం సమసిపోలేదు... వాట్ నెక్ట్స్?

Update: 2019-11-11 15:22 GMT
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఉత్కంఠ ఇంకా కొనసాగేలానే ఉందని చెప్పక తప్పదు. ఎన్నికలు ముగిసిన దరిమిలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు లేదని చేతులెత్తేయగా... అనూహ్యంగా గవర్నర్ నుంచి ఆహ్వానం అందుకున్న శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఘనంగానే ప్రకటించింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చిన శివసేనకు మద్దతిచ్చేందుకు ఓ వైపు ఎన్సీపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగానే సోమవారం సాయంత్రం దాకా వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు గానీ... శివసేనకు గవర్నర్ ఇచ్చిన గడువు (సోమవారం రాత్రి 7.30 గంటలు) ముగియడానికి కాస్తంత ముందుగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమకు మరో రెండు రోజుల గడువు కావాలని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే... గవర్నర్ ను కోరారు.

అయితే గవర్నర్ అందుకు సమ్మతించకపోగా... కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబందించి మరింత గడువు ఇచ్చే సమస్యే లేదని కాస్తంత కఠినంగానే వర్తమానం పంపారు. అంతేకాకుండా రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నీ కూడా సమసిపోవాలంటే తక్షణమే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సి ఉందని కూడా గవర్నర్ తెలిపారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న పీటముడి మరింత బిగిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయినా ఎన్సీపీ, కాంగ్రెస్ ల నుంచి మద్దతు దక్కినా కూడా శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని కోరడమేంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... శివసేనకు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా తన వైఖరిని స్పష్టం చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా... దానిని కొనసాగించగలమా? అన్న సంశయంలో శివసేన పడిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వకపోతే... ఎన్సీపీ నుంచి కూడా శివసేనకు మద్దతు దక్కే అవకాశాలు లేవన్న వాదనలూ లేకపోలేదు. మొత్తంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చిన రెండు పార్టీలు డోలాయమానంలో ఉన్న వైనాన్ని గుర్తించిన నేపథ్యంలోనే శివసేన... గవర్నర్ ను మరింత గడువును కోరిందని తెలుస్తోంది. అయితే ఎన్నికలు ముగిసి ఇప్పటికే చాలా రోజలు గడిచిపోగా... ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాని వైనం అక్కడ ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మరింత గడువు ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే శివసేనకు గడువు ఇచ్చేందుకు గవర్నర్ అంగీకరించలేదా? అన్న దిశగానూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఏది ఏమైనా... ఉత్కంఠ వీడిందని భావించిన మహారాష్ట్రలో ఇలా గవర్నర్ మరో ట్విస్ట్ ఇవ్వడంతో మహారాష్ట్ర రాజకీయం మరింత రంజుగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News