అమెరికాలో భారతీయులు ఎంత శాతం పన్నులు కడుతున్నారంటే!

Update: 2023-01-13 15:30 GMT
అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో అత్యధికం చైనీయులు అనే సంగతి తెలిసిందే. వీరి తర్వాత రెండో స్థానంలో భారతీయులు, మూడో స్థానంలో కొరియన్లు ఉన్నారు. కాగా అమెరికా జనాభాలో భారత సంతతి పౌరుల జనాభా 1 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అయితే అమెరికా జనాభాలో ఒక్క శాతమే ఉన్న భారత సంతతి పౌరులు ఆ దేశానికి వస్తున్న పన్నుల ఆదాయంలో 6 శాతం వాటా చెల్లిస్తుండటం గమనార్హం. ఈ విషయాలను స్వయంగా అమెరికా చట్ట సభ సభ్యుడు రిచ్‌ మెక్‌కార్మిక్‌ వెల్లడించడం విశేషం.  అమెరికా ప్రతినిధుల సభలో తాజాగా ప్రసంగం చేసిన రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి.. రిచ్‌ మెక్‌కార్మిక్‌ తన నియోజకవర్గం జార్జియాలో అత్యధికంగా నివసించే భారత సంతతి పౌరులను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత సంతతి పౌరులు ఎటువంటి సమస్యలు సృష్టించరని రిచ్‌ మెక్‌కార్మిక్‌ ప్రశంసించారు. అంతేకాకుండా చట్టాలను గౌరవిస్తారని కొనియాడారు. చట్ట పరిధిలో నడుచుకుంటూ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటారని అభినందించారు.

అలాగే అమెరికాలో ఉంటున్న మిగతా వారిలాగా భారత సంతతి పౌరులకు తీవ్ర కుంగుబాటు, ఓవర్‌ డోస్‌ వంటి సమస్యలు లేవని రిచ్‌ మెక్‌కార్మిక్‌ వెల్లడించారు.

అమెరికా దేశాభివృద్ధిలో భారత సంతతి పౌరులు కీలక పాత్ర పోషిస్తున్నారని రిచ్‌ మెక్‌కార్మిక్‌ వెల్లడించారు. దేశాభివృద్దికి అత్యధికంగా ఉత్పాదకతను అందిస్తున్నారని కొనియాడారు. అలాగే మరోవైపు తమ కుటుంబాలకు ఆధారంగా ఉంటున్న వారి నేపథ్యం ఎంతో ఉత్తమమైందని రిచ్‌ మెక్‌కార్మిక్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో చేసిన స్వల్ప ప్రసంగంలో రిపబ్లికన్‌ నేత రిచ్‌ మెక్‌కార్మిక్‌ ప్రసంగం ఈ మేరకు వైరల్‌ గా మారింది.

తన జార్జియా నియోజకవర్గంలో భారత్‌ నుంచి వలస వచ్చిన వారి వాటానే అధికమని రిచ్‌ మెక్‌కార్మిక్‌ తెలిపారు. సుమారు లక్ష మంది భారత సంతతి పౌరుడు జార్జియాలో స్థిరపడ్డారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఐదుగురు వైద్యుల్లో ఒకరు భారతీయులేనని చెప్పారు. ఇలా ఇక్కడకు వలస వచ్చి స్థిరపడాలనుకునే వారికి ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వివరించారు. ఇదే అంశాన్ని చర్చించడానికి భారత రాయబారితోనూ సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నా రిచ్‌ మెక్‌కార్మిక్‌ పేర్కొన్నారు.

కాగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన రిచ్‌ మెక్‌కార్మిక్‌ స్వయంగా డాక్టర్‌. జార్జియా నుంచి ఆయన రిపబ్లికన్‌ పార్టీ తరఫున గెలుపొందారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బాబ్‌ క్రిస్టియన్‌ను రిచ్‌ మెక్‌కార్మిక్‌ ఓడించారు. జార్జియాలో విదేశీయులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరిలో భారత సంతతి పౌరుల జనాభా ఎక్కువ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News