జ‌గ్గారెడ్డి జంపింగ్‌పై రేవంత్ ఏమంటున్నారంటే...

Update: 2022-02-19 16:45 GMT
టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం ఇటు తెలంగాణ రాజ‌కీయాల్లో అటు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ గుంపులో లేనని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు.

త‌న‌ను టీఆర్ఎస్ కోవర్ట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. అయితే, ఈ ర‌చ్చ‌ను రేవంత్ రెడ్డి ఓ రేంజ్‌లో లైట్ తీసుకున్నారు. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు.

మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మొక్కులు చెల్లించుకున్నారు.  ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, రాహుల్‌గాంధీకి లేఖ రాసిన జగ్గారెడ్డి అంశంపై  రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఇది ఒక సమస్య అని అన్నారు. అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని పేర్కొంటూ మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదని అన్నారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. టీ క‌ప్పులో తుపాను వ‌లే ఈ వివాదం స‌ద్దుమ‌ణుగుతుంద‌ని రేవంత్ సూత్రీక‌రించ‌డం గ‌మ‌నార్హం.
 
ఇక స‌మ్మ‌క్క జాత‌ర గురించి సైతం రేవంత్ స్పందించారు. రాజుల మీద పోరాడి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన సమ్మక్క సారలమ్మ జాతరవైపు సీఎం కేసీఆర్ కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమని అన్నారు.

దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రామేశ్వరరావు నిర్మించిన కృత్రిమ కట్టడాలు  దగ్గరకు ప్రధాని, సీఎం  వెళ్తారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మలను అవమానించే అధికారం  వీరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రూ. 200 కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారంను అభివృద్ధి చేయాలన్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని.. కుంభమేళా మాదిరే మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News