మోదీపై దీదీ మార్క్ పంచ్ పడిందిగా!

Update: 2019-02-17 04:16 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ‌... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారుపై విప‌క్షాల‌న్నీ ఒంటికాలిపై లేస్తున్నాయి. ఈ త‌ర‌హా దాడిలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీదే అందె వేసిన చెయ్య‌ని చెప్పాలి. ఓ ప‌క్క దేశ‌మంతా ఎన్నిక హీట్ పెరుగుతున్న క్ర‌మంలో పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు దొంగ దారిలో దెబ్బ తీశారు. ఏకంగా 44 మంది భార‌త సైనికుల‌ను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పైనే ఇప్పుడు దేశ‌మంతా చ‌ర్చ న‌డుస్తోంది. ఉగ్ర‌వాదుల‌కు ఊత‌మిస్తున్న పాకిస్థాన్‌ పై యుద్ధానికి దిగాల్సిందేన‌ని అన్ని ప‌క్షాలు కూడా ఒక్క గొంతుకై నినదిస్తున్నాయి. కేంద్రం నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష భేటీలోనూ ఇదే వాద‌న వినిపించింది.

ఈ నేప‌థ్యంలో పాక్‌ పై క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించేందుకు మోదీ సర్కారు కూడా స‌రేన‌న‌క త‌ప్ప‌లేదు. అందులోనూ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసిన ప్ర‌భుత్వంగా కాస్తంత మైలేజీతోనే ఉన్న‌ మోదీ స‌ర్కారు పాక్‌ పై క‌ఠిన ఆంక్ష‌ల దిశ‌గా సాగుతోంది. ఈ క్ర‌మంలో సైనికుల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ ఘ‌ట‌న‌పై దీదీ... త‌న‌దైన శైలిలో కొత్త‌గా స్పందించారు. అస‌లు ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డానికి కార‌ణాలేంట‌ని ప్ర‌శ్నించిన ఆమె... సైనికుల కుటుంబాల‌తో పాటు దేశం మొత్తం శోక‌సంద్రంలో మునిగిపోతే.... ప్ర‌ధాని మోదీ మాత్రం ప్రారంభోత్స‌వాలంటూ ఎలా సంబ‌రాలు చేసుకుంటార‌ని దాదాపుగా నిల‌దీసినంత ప‌నిచేశారు. అస‌లు సైనికుల‌కు నిత్యం ప్ర‌మాదం పొంచి ఉండే పుల్వామా లాంటి ప్రాంతాల‌పై నిత్యం నిఘా పెట్టాల్సిన నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్‌ లు ఏం చేస్తున్నాయ‌ని ఆమె త‌న‌దైన శైలి ప్ర‌శ్న‌ను సంధించారు.

మోదీపై త‌న‌దైన శైలి ప్ర‌శ్న‌ల‌ను సంధించిన దీదీ ఏమన్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *ఎన్‌ ఎస్‌ ఏ, ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నాయ్‌? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమే. ముప్పు ఉందని తెలిసి కూడా ఎందుకని అన్ని వ్యాన్‌ లను ఒకేసారి వెళ్లనిచ్చారు? అమరవీరులకు నివాళిగా కేంద్రం ఎందుకని సంతాప దినాలు ప్రకటించలేదు? అంటే కేవలం రాజకీయ నేతలు చనిపోతే మాత్రమే సంతాప దినాలు ప్రకటిస్తారా? ఉగ్రదాడిని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ షెడ్యూల్డ్‌ కార్యక్రమాలను నిలిపివేశాయి. కానీ ప్రధాని మాత్రం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం చూసినందుకు బాధగా ఉంది. ఏదైనా పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకుంటారు. మరి అలాంటప్పుడు మూడు రోజులు సంతాప దినాలు ఎందుకు ప్రకటించలేదు? * అని ఆమె ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళిగా మూడు రోజులను సంతాపదినాలుగా ప్రకటించాలని ఈ సంద‌ర్భంగా ఆమె డిమాండ్‌ చేశారు. అది వారికి మనమిచ్చే గౌరవమని కూడా ఆమె అన్నారు.
Tags:    

Similar News