అర్థరాత్రి వేళ.. శంషాబాద్ నుంచి రష్యాకు వెళ్లిన విమానంలో ఏం పంపారు?

Update: 2020-05-07 05:00 GMT
కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన సమాచారంగా దీన్ని చెప్పాలి. లాక్ డౌన్ వేళ.. దేశంలోని అన్ని విమానాశ్రయాలు మూతపడినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రత్యేకంగా తెరుస్తున్నారు. తాజాగా  శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి వేళ శంషాబాద్ నుంచి రష్యా రాజధాని మాస్కోకు ఒక విమానం బయలుదేరి వెళ్లింది. రష్యా నుంచి కార్గో విమానం తొలిసారి శంషాబాద్ కు రావటం ఒక ఎత్తు అయితే.. ఈ విమానం ద్వారా 50 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు) ఔషధాల్ని పంపారు.

ప్రపంచంలోనే అత్యంత పురాతన ఫ్రైట్ సర్వీసుల్లో ఒకటిగా చెప్పే రష్యా ఫ్రైట్ సర్వీసు విమానం శంషాబాద్ కు వచ్చింది. ఔషధాల తరలింపు కోసం బి777 కమర్షియల్ ప్యాసింజర్ విమానం హైదరాబాద్ చేరుకుంది. ఈ విమానంలో 20 రకాల ఔషధాలతో పాటు.. వ్యాక్సిన్లను రష్యాకు తరలించారు. లాక్ డౌన్ వేళ.. ఒక దేశానికి ఇంత భారీగా ఔషధాల్ని హైదరాబాద్ నుంచి తరలించటం ఇదే తొలి సారిగా చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యవసర సామాన్లు.. ఇతర వస్తువుల్ని విమానాల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు విషయానికే వస్తే.. కరోనా కాలంలో వాణిజ్య విమానాల్ని పెద్ద ఎత్తున నడపటం గమనార్హం. ఇప్పటివరకూ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు ఏకంగా 5500 టన్నుల బరువైన నిత్యవసర వస్తువులు.. మందులు.. ఇతరాలు పంపినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News