కరీంనగర్ డ్రైవర్ బాబు ఇంటి దగ్గర ఏం జరుగుతోంది?

Update: 2019-11-01 06:26 GMT
దగ్గర దగ్గర నాలుగు వారాలుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అనుకోని మలుపు తిరిగింది. ఊహించని విధంగా చోటు చేసుకున్న కరీంనగర్ డ్రైవర్ బాబు ఆకస్మిక మరణం ఆర్టీసీ ఉద్యోగుల్లోనే కాదు.. తెలంగాణ ప్రజల్లోనూ సానుభూతిని పెంచింది. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన సకల జనుల సమరభేరీలో పాల్గొనేందుకు హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంకు వచ్చి.. సభలో గుండెపోటుకు గురైన డ్రైవర్ బాబు మరణించిన సంగతి తెలిసిందే.

కరీంనగర్ జిల్లా అరేపల్లికి చెందిన డ్రైవర్ బాబు మరణం అక్కడి వారిని కదిలించేసింది. అంతేకాదు.. టీఆర్ ఎస్ ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ వర్గాలతో చర్చలు జరిపే వరకూ డ్రైవర్ బాబు అంత్యక్రియలు జరిపేది లేదంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

డ్రైవర్ బాబు భౌతికకాయానికి ఎంపీ బండి సంజయ్.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డి.. రాజిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు డ్రైవర్ బాబు ఇంటి వద్ద పహారా నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ జేఏసీతో చర్చలు ప్రారంభించే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ అల్టిమేటం విధించటంతో తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. డ్రైవర్ బాబు మరణంతో కరీంనగర్ లో నిర్వహించిన బంద్.. రెండో రోజు కూడా కొనసాగుతోంది. వ్యాపార.. వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థలు సైతం బంద్ లో పాలు పంచుకుంటున్నాయి. దీంతో.. ఇప్పుడు అందరి చూపు డ్రైవర్ బాబు ఇంటి మీదనే ఉన్నాయని చెప్పక తప్పదు. తాజా పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి వణుకుగా మారాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News