సుజనా.. పదవీ కాలం పూర్తయ్యాక పరిస్థితేంది?

Update: 2022-02-19 08:30 GMT
మనిషి ఎలాంటోడు అనే కన్నా.. అతడి పదవి ఏమిటన్న దాని మీదా కొన్నిసార్లు వారి భవిష్యత్తు డిసైడ్ అయి ఉంటుంది. వ్యాపారవేత్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు.. రాజకీయ నేతగా తనను తాను చెప్పుకుంటారు కానీ.. తన సొంతూరులో సర్పంచ్ ను సైతం గెలిపించుకోలేని దీన పరిస్థితి సుజనా చౌదరిది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలతో రాజ్యసభ సీటును సొంతం చేసుకున్న ఆయన.. గడిచిన కొన్నేళ్లుగా ఎంతలా అధికారాన్ని ఎంజాయ్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రత్యక్ష రాజకీయాలకు ఏ మాత్రం సూట్ కాని సుజనా.. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం పాలైనంతనే.. బీజేపీ శరణకు వెళ్లి.. వారి పంచన చేరటం తెలిసిందే. మామూలుగా అయితే తమ పార్టీని విడిచి పెట్టి.. మరో పార్టీలోకి చేరినంతనే.. సదరు నేతపై చర్యలు ఉంటాయి. కానీ.. సుజనా మీద చంద్రబాబు చర్యలు తీసుకున్నది లేదు. అంతేనా.. అసలు తనకు కుడి భుజంగా ఉండాల్సిన నేత తన దారిన తాను వెళ్లిన వైనంపై చంద్రబాబు రియాక్టు అయ్యింది లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వచ్చే నెలలో సుజనా రాజ్యసభ పదవీ కాలం పూర్తి కానుంది. సుజనా లాంటి నేతలకు ప్రజల్లో పలుకుబడి ఉండదు. కానీ.. వారికున్న అర్థబలంతో కీలక పదవుల్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. కాలం బాగున్నంత వరకు ఓకే. కానీ.. తేడా కొట్టిన నాడు పరిస్థితేంటి? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని చెప్పటమే కానీ చూసింది లేదు. వచ్చే నెలలో ఆయన పదవీ కాలం పూర్తి అయిన తర్వాత నుంచి ఆయన పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఎందుకిలా అంటే.. ఆయనపై పలు ఆర్థిక కేసులు.. ఆరోపణలు ఉన్నాయి. పదవి కారణంగా వచ్చే రక్షణ ఆయనకు రక్షగా మారిందంటారు. ఒకసారి పదవి పోయిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీకి తీసుకోవటమే కాని ఇచ్చే అలవాటు లేదు. అందునా సుజనా లాంటి నేతల్ని అవసరార్ధం వాడేయటమే తప్పించి.. తమను వాడుకునే అవకాశాన్ని అస్సలు ఇవ్వరు.

అలాంటివేళ.. సుజనాకు మరోసారి రాజ్యసభ సీటు లభించే అవకాశం లేదు. ఆయనకు పదవిని ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బోలెడన్ని సవాళ్లలో చిక్కి.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటివేళ సుజనాకు సాయం అందే పరిస్థితి ఉండదు. ఇక.. ఏపీలో బీజేపీకి ఉన్న సీన్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలాంటి వేళ.. పదవీ కాలం పూర్తి అయ్యాక మాజీ కావటం మినహా మరో మార్గం ఉండదు. చేతిలోని పదవితో తన అవసరాలకు భారీగా వాడేసిన సుజనా.. మాజీ అయ్యాక పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఏమైనా ఇప్పుడున్నట్లుగా సానుకూల పరిస్థితి అయితే ఉండదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News