మీ వాట్సాప్‌ ను ఈ సంస్థ హ్యాక్ చేసిందేమో!

Update: 2019-11-01 01:30 GMT
ప్ర‌స్తుతం స్మార్ట్‌ ఫోన్ వినియోగిస్తూ...వాట్సాప్‌ ను వాడ‌ని వారు అత్యంత అరుదు అని పేర్కొన‌వ‌చ్చు. అంత‌లా...ఈ సోష‌ల్ మీడియా మాధ్య‌మం మ‌న జీవితాల్లో భాగ‌మైంది. అయితే, వాట్సాప్ కేంద్రంగా జ‌రిగిన ఓ సంచ‌ల‌న `చోరీ`వెలుగులోకి వ‌చ్చింది. భార‌తీయ జ‌ర్న‌లిస్టులు - మాన‌వ హ‌క్కుల నేత‌ల‌కు సంబంధించిన వాట్సాప్ అకౌంట్ల‌ను ఇజ్రాయిల్ స్పైవేర్ సంస్థ హ్యాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఫేస్‌ బుక్‌ కు చెందిన వాట్సాప్ ఈ విష‌యాన్ని ద్రువీక‌రించింది. ఎన్ ఎస్‌ వో గ్రూపుపై దావా వేయ‌నున్న‌ట్లు వాట్సాప్ చెప్పింది. అయితే - ఈ హ్యాకర్‌ ల మాతృక అయిన ఇజ్రాయిల్‌ కు చెందిన ఎన్ ఎస్ ఓ మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తోంది.

సంచ‌ల‌న వివ‌రాల్లోకి వెళితే...ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్‌వో సంస్థ అభివృద్ధి చేసిన‌ స్పైవేర్ పెగాస‌స్ వైర‌స్‌ తో ఈ నేరానికి పాల్ప‌డ్డారు. సుమారు నాలుగు ఖండాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు - రాజ‌కీయ‌వేత్త‌లు - జ‌ర్న‌లిస్టులను హ్యాక్ చేశారు. ఫోన్‌ హ్యాక్ చేసిన మాల్‌ వేర్ .. యూజర్ల మెసేజ్‌ ల‌ను - కాల్స్‌ - పాస్‌ వ‌ర్డ్‌ ల‌ను చోరీ చేసింది. దాదాపు1400 మంది యూజ‌ర్ల ఫోన్ల‌ను వాట్సాప్ ద్వారా హ్యాక్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే క‌చ్చితంగా ఎంత మంది ఫోన్లు హ్యాక్ అయ్యాయ‌న్న విష‌యాన్ని మాత్రం వాట్సాప్ స్ప‌ష్టం చేయ‌లేక‌పోయింది.

అమెరికాకు చెందిన కార్ల్ ఉగ్ తెలిపిన ప్రకారం.. భారతీయ జర్నలిస్టులు - మానవ హక్కుల కార్యకర్తలను నిఘా సాఫ్ట్‌ వేర్ ద్వారా టార్గెట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ లో సుమారు రెండు వారాల పాటు భార‌తీయ జ‌ర్న‌లిస్టుల‌ - మాన‌వ హ‌క్కుల నేత‌ల వాట్సాప్ స‌మాచారాల‌పై ఇజ్రాయిల్ కంపెనీ నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని ఫోన్ల‌పై సైబ‌ర్ దాడి జ‌రిగిన‌ట్లు మే నెల‌లో ఫేస్‌ బుక్ సంస్థ గుర్తించింది. ఆ త‌ర్వాత ఆ దాడుల‌ను బ్లాక్ చేశారు. వీడియో కాల్ చేస్తున్న స‌మ‌యంలో పెగాస‌స్ అనే స్పైర్‌ వేర్ ఫోన్‌ లోకి ప్ర‌వేశిస్తుంది. ఒక‌వేళ ఫోన్ మాట్లాడ‌కున్నా.. వైర‌స్ మాత్రం ఫోన్లో ఇన్‌ స్టాల్ అవుతుంది. వైర‌స్ కోడ్‌ తో ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ ను హ్యాక్ చేసి.. యూజ‌ర్ డేటాను యాక్సెస్ చేస్తారు. ఇలా ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ పై అటాక్ చేసిన త‌ర్వాత దాంట్లో ఉన్న డేటాను దొంగ‌లించింది ఆ సంస్థ‌.

కేంద్ర‌ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈ ప‌రిణామంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ...భార‌తీయుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని త‌స్క‌రించ‌డం ప‌ట్ల తాము క‌ఠినంగ వ్య‌వ‌హ‌రిస్తామ‌ని తెలిపారు. వాట్సాప్‌ను వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరాం`అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఈ-మెయిల్స్ - ఫోన్ కాల్స్ - మెసేజ్ ద్వారా హోం శాఖ కార్యదర్శి ఏకే భల్లా - ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రెటరీ ఏపీ సానీ నుంచి వివరాలను సేకరించడానికి ప్రయత్నించగా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.


Tags:    

Similar News